-

‘ఫీజు’ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

21 Sep, 2016 02:41 IST|Sakshi
‘ఫీజు’ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

సాక్షి, హైదరాబాద్: పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రాజకీయ జేఏసీ చైర్మన్ ఎం. కోదండరాం డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయనిఆయన అన్నారు. పీడీఎస్‌యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శాఖల ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ జరిగిన సదస్సుకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల సంఖ్య తగ్గి ప్రైవేటు కాలేజీల సంఖ్య పెరిగిందని...పేద ప్రజలు స్థోమత లేకున్నా వారి పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివించుకుంటున్న పరిస్థితుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోదండరాం పేర్కొన్నారు. లేకపోతే ప్రైవేటు కాలేజీలు కూడా మూతపడి కార్పొరేట్ విద్యాసంస్థల జులుం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడంతోపాటు మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల సంఘం అధ్యక్షుడు గౌతంరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 2,500 కోట్లను సరైన సమయంలో చెల్లిస్తే పేద విద్యార్థులకు చదువు దూరం కాదన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి ఏర్పడితే డీమ్డ్ యూనివర్సిటీలు, కార్పొరేట్ విద్యాసంస్థలు రాజ్యమేలుతాయన్నారు.

ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మసీ కళాశాలల అధ్యక్షుడు కె. రామ్‌దాస్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సదస్సుకు పీడీఎస్‌యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు వి.రియాజ్ అధ్యక్షత వహించగా, ప్రొఫెషనల్ కళాశాలల ప్రతినిధి కె. ప్రభాకర్‌రెడ్డి, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రీనివాస్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.డి. రాము తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు