మంత్రికి మహిళా అధికారి బురిడీ!

11 May, 2018 00:16 IST|Sakshi

తన భర్తను హైదరాబాద్‌కు బదిలీ చేయించుకునేందుకు యత్నం

ఖాళీలు లేవంటూ ఫైలుపై కొర్రీ రాసిన పౌర సరఫరాల కమిషనర్‌

కొర్రీపై వైట్‌నర్‌ పూసి మంత్రితో సంతకం చేయించుకున్నమహిళా అధికారి

సాక్షి, హైదరాబాద్‌: ఆమె సాగునీటి శాఖలో మహి ళా అధికారి.. పౌర సరఫరాల శాఖ పరిధిలో పని చేస్తున్న తన భర్తను బదిలీ చేయించుకునేందుకు ఏకంగా మంత్రి ఈటల రాజేందర్‌నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ బదిలీ వీలుపడదంటూ ఫైలుపై ఉన్న కొర్రీలను వైట్‌నర్‌తో చెరి పేసి.. మంత్రితో సంతకం చేయించుకున్నారు. చివరికి మంత్రి ఓఎస్డీ పరిశీలనలో ఈ ‘చిట్టి’మోసం బయటపడింది. ఈ మోసంలో ఈటల పర్యవేక్షిస్తున్న పౌరసరఫరాల శాఖ సిబ్బంది పాత్ర ఉన్నట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పలుకుబడి ఉపయోగించినా..
సాగునీటి శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తు న్న ఓ మహిళా అధికారి భర్త.. పౌర సరఫరాల విభాగంలో వికారాబాద్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నా రు. ఆయన్ను హైదరాబాద్‌కు బదిలీ చేయించుకునేందుకు సదరు అధికారి ప్రయత్నం మొదలుపెట్టారు. దీనికోసం అదనపు కార్యదర్శిగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకున్నారు. పౌరసరఫరాల శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి  పేషీ లోని సిబ్బంది సహకారంతో.. ఆ బదిలీ ఫైల్‌ను కిందిస్థాయి నుంచి కమిషనర్‌ కార్యాలయం చేర్చారు.

కానీ హైదరాబాద్‌లో ఆ స్థాయి పోస్టు ఏదీ ఖాళీగా లేదంటూ పౌరసరఫరాల శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ సునీల్‌శర్మ ఫైలుపై కొర్రీ రాశారు. దీంతో ఫైలు ఆగిపోయింది. వెనక్కి తగ్గని ఆ అధికారి.. మంత్రి పేషీ సాయంతో అదే ఫైలును మరోసారి ముందుకు కదిపారు. ఆ ఫైలు పై కమిషనర్‌ రాసిన కొర్రీపై వైట్‌నర్‌ పూసి.. కొర్రీ ఏమీ లేనట్టుగా మార్చేశారు. అనంతరం ఆ అధి కారి తన భర్తను బదిలీ చేయాలంటూ స్వయంగా ఫైలును మంత్రి ఈటల వద్దకు తీసుకెళ్లారు. కమిషనర్‌ రాసిన కొర్రీ కనబడకుండా చేయడంతో.. మంత్రి ఆ ఫైలుపై సంతకం చేసేశారు.

ఓఎస్డీ అప్రమత్తతతో..: మంత్రి సంతకం తర్వాత ఆ బదిలీ ఫైలు ఓఎస్డీకి చేరింది. దానిని పరిశీలించిన ఓఎస్డీ.. వైట్‌నర్‌ పూసినట్లు గుర్తించి, ఫైలును వెనక్కి పంపి మంత్రిని అప్రమత్తం చేశా రు. దాంతో అసలు తతంగం బయటపడింది. సాధారణంగా మంత్రి తాను సంతకం చేయాల్సిన ఫైళ్లపై ఓఎస్డీని సంప్రదించిన తర్వాతే సం తకం చేస్తుంటారు.

కానీ ఈ వివాదాస్పద బదిలీ ఫైలును మంత్రి పేషీలోని సిబ్బందే.. ఓఎస్డీ లేని సమయంలో ముందుకు కదిపినట్టు తెలుస్తోంది.  మంత్రి పేషీలోని సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి..
తన కళ్లు గప్పి బదిలీ ఫైలును ముందుకు కదిపిన వ్యవహారంపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ ఫైలును పక్కన పడేయటంతోపాటు, వైట్‌నర్‌ పెట్టిందెవరనే దానిపై సిబ్బందిని నిలదీసినట్టు తెలిసింది. ఈ బదిలీ విషయంగా మహిళా అధికారి వ్యవహరించిన తీరును ఆమె పనిచేస్తున్న శాఖా మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

వెంటనే స్పందించిన మంత్రి హరీశ్‌.. ఆమెను సాగునీటి శాఖ నుంచి బదిలీ చేయాలని సిఫార్సు చేయగా, ఆమెను జీఏడీ విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు