‘డాన్‌ శీను’మళ్లీ చిక్కాడు!

11 Apr, 2017 23:00 IST|Sakshi
‘డాన్‌ శీను’మళ్లీ చిక్కాడు!

కొన్నేళ్ల క్రితం చిరంజీవి ఇంట్లో చోరీకి యత్నం
ఇప్పటి వరకు 21 కేసుల్లో నిందితుడు
తాజాగా ముషీరాబాద్‌లో రెండో చోరీలు


సిటీబ్యూరో: దాదాపు పదకొండేళ్ల క్రితం సినీ నటుడు చిరంజీవి ఇంట్లో చోరీకి యత్నించిన ఘరానా దొంగ కోన శ్రీను అలియాస్‌ డాన్‌ శ్రీను మరోసారి పోలీసులకు చిక్కాడు. ఈసారి ముషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో రెండు ఇళ్లో్లల్లో దొంగనాలకు సంబంధించిన కేసుల్లో ఇతడిని అరెస్టు చేసినట్లు మధ్య మండల డీసీపీ డి.జోయల్‌ డెవిస్‌ సోమవారం వెల్లడించారు. ఇతడి నుంచి రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి  స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గెడ్డనపల్లికి చెందిన కోన శ్రీను 17 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని పీ అండ్‌ టీ కాలనీలో ఎలక్ట్రీషియన్‌గా స్థిరపడిన ఇతను తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం చోరీల బాటపట్టాడు.

మెగాస్టార్‌ ఇంటి గోడ దూకి...
అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న డాన్‌ శ్రీనుకు కొన్ని కేసుల్లో న్యాయస్థానం దోషిగా నిర్థారించి జైలు శిక్ష కూడా విధించింది. 2006లో జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని సినీ నటుడు చిరంజీవి ఇంట్లో గోడ దూకి లోపలకు ప్రవేశించగా, పెంపుడు కుక్కలు వెంటపడటంతో సెక్యూరిటీ గార్డులు పట్టుకోవడానికి యత్నించారు. దీంతో వారిపై దాడి చేసి పారిపోయేందుకు విఫలయత్నం చేసినా సాధ్యం కాకపోవడంతో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. గడిచిన 17 ఏళ్లల్లో సరూర్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, గోపాలపురం పోలీసుస్టేషన్ల పరిధిలో 21 నేరా లు చేశాడు. ఇళ్ళల్లో చోరీలతో పాటు వాహనచోరీలు సైతం చేసిన ఇతగాడికి కొన్ని కేసుల్లో శిక్ష కూడా పడింది. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి  చోరీలు చేయడం ఇతడి నైజం.

చోరీ ‘లగేజీ’తో ఆటోలో..
డాన్‌ శ్రీను గత నెల 23న ముషీరాబాద్‌ ఠాణా పరిధిలోని భోలక్‌పూర్‌ పద్మశాలి కాలనీలో పంజా విసిరాడు. పదవీ విరమణ చేసిన ఉద్యోగి  దయానంద్‌ ఇంటిని టార్గెట్‌గా చేసుకున్న ఇతను పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. 40 అంగుళాల ఎల్‌ఈడీ టీవీతో పాటు ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, మూడున్నర కేజీల వెండి తదితరాలు ఎత్తుకెళ్లాడు. వీటిని సూట్‌కేసులు, బెడ్‌షీట్స్‌లో నేర్పుగా పార్శిల్‌ చేసుకున్న శ్రీను వాటిని తరలించడానికి ఆటో వినియోగించాడు. ఇల్లు ఖాళీ చేస్తున్నానంటూ ఆటో డ్రైవర్‌కు చెందిన శ్రీను రూ.800 కిరాయి చెల్లించి మరీ వాటిని పీ అండ్‌ టీ కాలనీలోని తన ఇంటికి చేర్చాడు.

సొత్తు రికవరీ...
అదే ఠాణా పరిధిలోని మరో ఇంట్లోనూ చేతివాటం చూపించిన శ్రీను అక్కడ నుంచి ఓ సెల్‌ఫోన్‌ చోరీ చేశాడు. దయానంద్‌ ఇంట్లో చోరీ కేసును ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రామ్‌చంద్రారెడ్డి నేతృత్వంలో డీఐ డి.సంతోష్‌కుమార్, డీఎస్సై బాల్‌రాజ్‌ దర్యాప్తు చేశారు. సోమవారం ఉదయం డాన్‌ శ్రీనును పట్టుకున్న అధికారులు అతడి నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు. ఇతడి వద్ద మరో 13 సెల్‌ఫోన్లు రికవరీ అయినా.. వీటికి సంబంధించి ఎక్కడా కేసులు నమోదు కాలేదు. వేసవి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సెలవుల కోసం ఎక్కడికైనా వెళ్తున్నట్‌లైతే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ జోయల్‌ డెవిస్‌ కోరారు.

మరిన్ని వార్తలు