ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ నామినేషన్లు ప్రకటించిన నాగచైతన్య

8 Jun, 2017 20:13 IST|Sakshi
ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ నామినేషన్లు ప్రకటించిన నాగచైతన్య

హైదరాబాద్:
ప్రతిష్టాత్మక ‘64వ జియో సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2017’ ప్రదానోత్సవానికి హైదరాబాద్ ముస్తాబవుతోంది. రిలయన్స్ జియో తెలంగాణా సీఈఓ కె.సి.రెడ్డి, ఫిల్మ్ ఫేర్ ఎడిటర్ జితేష్ పిళ్లైల సమక్షంలో హీరో నాగచైతన్య నామినేషన్లను ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని జోనా క్రిసెంట్ లోని రిలయన్స్ డిజిటల్ స్టోర్లో నిర్వహించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జూన్ 17న నగరంలోని హెచ్‌ఐసీసీ నోవాటెల్లో జరగనుంది.

ఫిల్మ్ పేర్ మేగజైన్ ఎడిటర్ జితేష్ పిళ్లై మాట్లాడుతూ.. 'ఇటీవలి కాలంలో సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే దృశ్యాలు, ప్రతిభకు చిరునామాగా దక్షిణ సినీ పరిశ్రమ మారింది.. ప్రతి ఏడాది లానే ఈసారి కూడా నామినేషన్లు కోసం ఉత్తమ ప్రతిభను వెలికితీసి, వివిధ రకాల చిత్రాలను పరిగణలోకి తీసుకున్నాము. జియో సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 64వ ఎడిషన్ ద్వారా వీక్షకులు ఆ రాత్రిని ఎప్పుడు మర్చిపోలేని విధంగా అద్భుత దృశ్యకావ్యంగా మలచగలమని భావిస్తున్నాం' అని తెలిపారు.


రిలయన్స్ జియో తెలంగాణా సీఈఓ కె.సి.రెడ్డి మాట్లాడుతూ.. 'జియో సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2017ను అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేక డిజిటల్ విధానంలో జియో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2017 ప్రదర్శించబోతున్నాం. 120 కోట్ల మంది భారతీయులకు డిజిటల్ సేవలు అందేలా భారత డిజిటల్ రంగంలో జియో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. భారతీయ సినిమా వైవిధ్యం, గొప్పతనాన్ని సంబరంలా జరుపుకునేలా జియో మిషన్ సహకరిస్తుంది' అని అన్నారు.
 
ఫిల్మ్ ఫేర్ అవార్డులను మార్చి 21, 1953లో ప్రారంభించారు. ఎన్నో తరాల నట దిగ్గజాలను చూసిన పురాతనమైన, అత్యంత ప్రతిష్ఠాత్మక సినీ సంస్థ ఇది. కేవలం ఐదు అవార్డులతో చిన్న కార్యక్రమంలా మొదలై..అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది.

మరిన్ని వార్తలు