ఎంసెట్పై నిర్ణయం సోమవారమే!

29 Jul, 2016 19:15 IST|Sakshi

తెలంగాణలో ఎంసెట్ మెడికల్ పేపర్ లీకవ్వడంతో.. ఆ పరీక్షను రద్దుచేయాలా లేక తప్పు చేసినట్లు తేలిన విద్యార్థుల ఫలితాలను మాత్రం ఆపి మిగిలిన వారికి ఇవే ఫలితాలను కొనసాగించాలా అనే విషయంలో సోమవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎంసెట్ వ్యవహారంపై డీజీపీ అనురాగ్ శర్మ,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. లీకేజిపై సీఐడీ దర్యాప్తు చేసి రూపొందించిన నివేదికను ఆయనకు అందించారు. పరీక్షను రద్దు చేయొద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తున్న విషయాన్ని కూడా సీఎంకు చెప్పినట్లు సమాచారం.

ఇది 56 వేలమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి.. రద్దు చేయడం తగదన్న అభిప్రాయాలే ఉన్నతాధికారుల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం 100-150 మంది చేసిన తప్పునకు మొత్తం అందరినీ శిక్షించడం ఎంతవరకు సబబన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ విషయంపై హైకోర్టు న్యాయవాదులతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాదులను కూడా సంప్రదించి ఓ నిర్ణయానికి రావాలన్న ఉద్దేశంలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తుది నిర్ణయాన్ని సోమవారానికి వాయిదా వేశారని అంటున్నారు.

>
మరిన్ని వార్తలు