లక్షన్నర పోస్టులు మాయం

4 May, 2016 02:06 IST|Sakshi
లక్షన్నర పోస్టులు మాయం

భర్తీ చేసేది 20,244.. సీఎం ఆమోదానికి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు
 
 సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని, లేదంటే ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలముందు ఊదర గొట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు నిరుద్యోగుల ఆశలపై కత్తి దూశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. ఇంతే కాకుండా జూన్ 2వ తేదీ నాటికి 30 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు.

ఈ పోస్టులతో కలిపితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయరాదని, కేవలం 20,244 పోస్టుల భర్తీతో ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 1.52 లక్షల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పలికింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయకపోగా ఖాళీల సంఖ్యను కుదించడంపైనే కసరత్తు చేయించారు. ఆ మేరకు 20,244 పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించారు.

 నాలుగో తరగతి ఉద్యోగాల భర్తీ లేదు
 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నాలుగో తరగతి ఉద్యోగాలను భర్తీ చేయరాదని నిర్ణయించారు. అంటే పెద్ద చదువులు చదవలేని ఆర్థిక స్థోమత లేని కింద తరగతి, మధ్యతరగతి నిరుద్యోగులకు ఇక సర్కారు కొలువులు ఎండమావేనని తేలిపోయింది. పదవ తరగతి, ఇంటర్మీడియెట్ మాత్రమే చదివిన నిరుద్యోగులు అటెండర్ లేదా డ్రైవర్, రికార్డు అసిస్టెంట్ వంటి పోస్టులు వస్తాయని భావించేవారు. రాష్ట్రప్రభుత్వం ఈ ఖాళీలను భర్తీ చేయరాదని నిర్ణయించడంతో లక్షలాది మంది నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. నాలుగో తరగతి ఉద్యోగాలను అవసరాలకు అనుగుణంగా కేవలం ఔట్‌సోర్సింగ్‌లో భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం వివిధ శాఖల్లో 20,244 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించింది.

ఇందులో పోలీసు పోస్టుల భర్తీ మినహాయించి మిగతా అన్ని పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని సిఫార్సు చేసింది. ఇందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపితే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఆదేశాలు జారీ చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని నిర్ణయించిన పోస్టుల్లో గ్రూప్-1 కేవలం 94 మాత్రమే ఉన్నాయి. అత్యధికంగా పోలీసు శాఖలో 9000 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ పోస్టుల్లో కానిస్టేబుళ్లతో పాటు ఎస్‌ఐ, సీఐ పోస్టులు కూడా ఉన్నాయి. గ్రూప్-2 పోస్టులు 1100, గ్రూప్-3 పోస్టులు 1500 భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఇతర రంగాల్లో 6,500 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ రంగాల్లో 550 లెక్చరర్, 500 హాస్టల్ వార్డెన్,  750 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, 600 వ్యవసాయ విస్తరణాధికారులు, 200 గణాంక సహాయ ఆఫీసర్లు, 300 గిరిజన సంక్షేమ శాఖ, మత్స్య, పశుసంవర్థక తదితర రంగాల్లో పోస్టులున్నాయని ఉన్నతాధికారి వివరించారు.

మరిన్ని వార్తలు