హైదరాబాద్ : హైదరాబాద్ తార్నాకలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో తార్నాకలోని చైనా బజార్ కాలి బూడిదయ్యింది. ఉదయం దుకాణం నుంచి దట్టమైన పొగ రావటంతో స్థానికులు ఈ విషయాన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. దుకాణంలోని ప్లాస్టిక్ వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు రూ.25 లక్షలు ఆస్థినష్టం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే మంటలు అదుపులోకి వచ్చినా పొగ ఆ ప్రాంతమంతా దట్టంగా అలుముకుంది. కాగా దుకాణం ఉన్న సముదాయంలోనే పైన ఓ ప్రయివేటు స్కూల్ నడుస్తోంది. సకాలంలో మంటలను అదుపు చేయటంతో స్కూల్కు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.