టీ తాగేందుకు పెళ్లి బస్సు దిగడంతో..

3 Apr, 2016 05:05 IST|Sakshi
టీ తాగేందుకు పెళ్లి బస్సు దిగడంతో..

చిలకలగూడ: పెళ్లి బస్సులో మంటలు చెలరేగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే, అక్కడున్న వారు అప్రమత్తమై వధువు సహా బస్సులో ఉన్న 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావటంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన వివరాలివీ.. సికింద్రాబాద్ సీతాఫల్‌మండి జోషి కాంపౌండ్‌లోని రీజెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఎ.గీతారావు కుమార్తె వివాహం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆదివారం జరగాల్సి ఉంది. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు న్యూదక్కన్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సును అద్దెకు తీసుకున్నారు. బస్సును డ్రైవర్ ఆంజనేయులు శనివారం ఉదయం 10 గంటలకు పెళ్లివారింటి ప్రాంగణంలోకి తీసుకువచ్చాడు. బస్సును స్టార్ట్ చేసి ఉంచి ఏసీని ఆన్ చేసి బస్సు దిగి టీ తాగేందుకు వెళ్లాడు. పెళ్లి కుమార్తెతో పాటు సుమారు 20 మంది చిన్నారులు, వృద్ధులు బస్సులో కూర్చున్నారు. ఏసీ బయటకు పోతుందని బస్సు డోర్‌ను వేశారు.

ఈ క్రమంలో బస్సు ముందుభాగంలోని ఇంజన్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగతోపాటు మంటలు వ్యాపించాయి. ఒకరికొకరు కనిపించలేనంత పొగ క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించింది, భయాందోళనలతో బస్సులోని వారంతా గట్టిగా కేకలు వేయసాగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న చిలకలగూడ ఏఎస్‌ఐ జగన్మోహనరావుతోపాటు స్థానికులు, బంధువులు బస్సు అద్ధాలు పగులగొట్టి పెళ్లికుమార్తెతోపాటు లోపలున్న అందరినీ రక్షించారు.

సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు, తార్నాక అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కొద్దిసేపటి తర్వాత మరో బస్సులో పెళ్లికి తరలివెల్లారు. ఈ ప్రమాదానికి డీజిల్ లీకేజీ కావడమేనని పోలీసులు భావిస్తున్నారు. ఏసీ ఆన్ చేయడంతోపాటు ఎండలు మండిపోతుండడంతో ఇంజన్ వేడెక్కిపోయి ఉంటుందని, డీజిల్ లీక్ కావడంతో ఒక్కసారిగా ఇంజన్ నుంచి మంటలతోపాటు దట్టమైన పొగ వ్యాపించిందని తెలిపారు. బస్సు డ్రైవర్ ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

మరిన్ని వార్తలు