ఆర్టీసీ బస్సులో మంటలు

4 Sep, 2015 03:16 IST|Sakshi
ఆర్టీసీ బస్సులో మంటలు

సాక్షి,సిటీబ్యూరో/రాంగోపాల్‌పేట్ : నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంట లొచ్చి తగలబడిపోయింది. ప్రయాణికులు వెంటనే బస్సు దిగి బయటకు పరుగు తీయడంతో పెనుప్రమాదం తప్పింది. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు... జీడిమెట్ల డిపోకు చెందిన రూట్- 29 బస్సు (ఏపీ 11జడ్ 7403) గురువారం ఉదయం 8.25కి జగద్గిరిగుట్ట నుంచి సికింద్రాబాద్ వెళ్తోంది. బస్సు ప్యాట్నీ చౌరస్తాకు చేరుకోగానే ఆగిపోయింది.  డ్రైవర్ నరసింహ బస్సును స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా బానెట్ వద్ద శ బ్దం వచ్చింది. ఆ వెంటనే పొగ, మంటవచ్చింది.  డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. 

కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సు ముందు భాగమంతటా వ్యాపించి బస్సు దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. బస్సు ఇంజిన్, బానెట్, ఇతర భాగాలన్నీ పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని ఆర్టీసీ అధికారులు, పోలీసులు భావిస్తున్నారు. సికింద్రాబాద్ ఆర్‌ఎం కొమరయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహంకాళీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 తరచూ ప్రమాదాలు....
 బస్సుల నిర్వహణలో ఆర్టీసీ వైఫల్యం పరాకాష్టకు చేరింది. తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు జ రుగుతూనే ఉన్నాయి. గతంలో లక్డీకాఫూల్ వద్ద, శంషాబాద్ విమానాశ్రయ మార్గంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. గురువారం బస్సులో మం టలంటుకున్న సమయంలో  20 మంది ప్రయాణికులు మాత్రమే ఉండటంతో వేగంగా కిందకు పరుగెత్తగలిగారు. బస్సు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటే మాత్రం  ప్రమాదం ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోలేం. బస్సు సెల్ఫ్ స్టార ్టర్ ఫెయిల్ కావడం, డ్రైవర్ అదే పనిగా స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో స్పార్క్ (నిప్పురవ్వలు) వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

ఎఫ్‌ఆర్‌సీ ప్లాస్టిక్‌తో రూపొందించినది కావడం వల్ల ఇంజిన్ బానెట్ త్వరగా అంటుకుందని గుర్తించారు. పైగా ఎలక్ట్రికల్ వైర్లు బాగా పాతబడి పోయాయని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.  గురువారం సికింద్రాబాద్‌లో కానీ, కొద్ది రోజుల క్రితం నల్లకుంట.. అంతకుముందు లక్డీకాఫూల్, శంషాబాద్‌ల్లో మంటలంటుకున్న బస్సులన్నీ మెట్రో ఎక్స్‌ప్రెస్, లోఫ్లోర్ బస్సులే కావడం గమనార్హం. ఈ బస్సుల నిర్వహణపై నిర్లక్ష్యం, సకాలంలో విడిభాగాలు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రోజూ బ్రేక్‌డౌన్‌ల కారణం గా పదుల సంఖ్యలో బస్సులు రోడ్లపైనే నిలిచిపోతున్నా యి.

ఈ రెండు మూడేళ్లలో జరిగిన అగ్నిప్రమాదాల్లో అ దృష్టవశాత్తు ఎక్కడా ప్రయాణికులకు ఎలాంటి ప్రమా దం జరగకపోవడం సంతోషించదగ్గ విషయం. ఒకవేళ ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా సిటీ బస్సుల్లో పయనించినందుకు భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చేది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 డిపోలలో 3850 బస్సులు ఉంటే వాటిలో సుమారు 1000 బస్సులు డొక్కువే. సకాలంలో విడిభాగాలు అమర్చకపోవడం, మరమ్మతులు చేయకపోవడం, నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఈ బస్సులు తరచూ బ్రేక్‌డౌన్‌లకు గురవుతున్నాయి. భయంకరమైన కాలుష్యాన్ని చిమ్ముతున్నా యి. ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

మరిన్ని వార్తలు