జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ

18 May, 2017 00:17 IST|Sakshi
జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ

- ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు
- వెల్లడించిన బత్తిని సోదరులు  


హైదరాబాద్‌: ఉచిత చేప ప్రసాదాన్ని జూన్‌ 8న ఉదయం 6 గంటలకు పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు విశ్వనాథం గౌడ్, హరినాథ్‌ గౌడ్, గౌరీశంకర్‌ గౌడ్‌లు తెలిపారు. ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం రోజున ఉబ్బస వ్యాధి గ్రస్తులకు పాతబస్తీలోని దూద్‌బౌలిలో బత్తిని వంశం ఆధ్వర్యంలో ఉచిత చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం బత్తిని సోదరులు సాక్షితో మాట్లాడుతూ... జూన్‌ 8న దూద్‌బౌలి లోని తమ నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఎగ్జిబిషన్‌ మైదానంలో పంపిణీ చేస్తామన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది లక్షలాది మంది చేప మందు సేవించేందుకు విచ్చేస్తారని, వారి కోసం ప్రభుత్వం తరఫు న అన్ని ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నాయని బత్తిని సోదరులు తెలిపారు. దూద్‌బౌలిలోని తమ ఇంట్లో 8, 9న చేపమందు పంపిణీ చేస్తామన్నారు. ఈ చేప ప్రసాదాన్ని ఉచి తంగా పంపిణీ చేస్తున్నామని, నకిలీ చేప ప్రసాదం పంపి ణీ చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష
ఉచిత చేప మందు పంపిణీ కోసం లక్ష చేప పిల్లలను సిద్ధం చేయాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. జూన్‌ 8న నిర్వహించనున్న చేప మందు పంపిణీ ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో పలు విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడు తూ, బత్తిని సోదరులు అందించే చేప మందు కోసం నగరంలోని ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు.

దూర ప్రాంతాల వారి కోసం 110 ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు చెప్పా రు. హెల్త్‌ క్యాంప్‌లను నిర్వహించడంతో పాటు నాలుగు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌ మైదానానికి చేపల సరఫరా కోసం మొబైల్‌ టీంలను ఏర్పాటు చేయాలని, బారికేడ్లను అమర్చాలని సూచించారు. సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ, జాయింట్‌ కలెక్టర్‌ ప్రశాంతి, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ డేవిడ్‌ జోయల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు