జూరాలకు నేడు వరద

2 Sep, 2017 03:30 IST|Sakshi
జూరాలకు నేడు వరద
నారాయణపూర్‌ నుంచి 20 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల
- ఉజ్జయిని డ్యామ్‌ నుంచి వస్తున్న 32 వేల క్యూసెక్కుల ప్రవాహాలు
ఇప్పటికే జూరాలకు కొనసాగుతున్న 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  
 
సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్ర, కర్ణాటకలలో భారీ వర్షాలకు అక్కడి ప్రాజెక్టులు నిండటంతో రాష్ట్రంవైపు కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. మహారాష్ట్రలోని ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి 32 వేల క్యూసెక్కులు, కర్ణాటకలోని నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి సుమారు 20 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయడంతో జూరాలవైపు వరద పరుగులెడుతోంది. శనివారం నాటికి ఈ ప్రవాహాలన్నీ కలిసి జూరాలకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే జూరాల దాదాపు నిండటంతో దిగువనున్న శ్రీశైలానికి నీటి విడుదల జరిగే అవకాశం ఉంది. 
 
6 టీఎంసీల మేర వరద వచ్చే అవకాశం 
మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ప్రధాన ప్రాజెక్టు కోయినా డ్యామ్‌తోపాటు ఇతర చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిండటంతో దిగువన కర్ణాటకకు ఉధృతంగా ప్రవాహాలు వస్తున్నాయి. ఆల్మట్టి డ్యామ్‌లోకి గురువారం ఉదయం 56 వేల క్యూసెక్కుల మేర వరద రాగా సాయంత్రానికి అది మరింత పెరిగినట్లు నీటిపారుదల వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో అక్కడి నుంచి 33,750 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నారాయణపూర్‌కు వదులుతున్నారు. ఇప్పటికే నారాయణపూర్‌ పూర్తిగా నిండటంతో ప్రాజెక్టు నుంచి 16 వేల క్యూసెక్కులను స్పిల్‌వే ద్వారా, మరో 4,800 క్యూసెక్కులను పవర్‌హౌస్‌ ద్వారా దిగువకు వదులుతున్నారు.

ఇక ఉజ్జయినీ డ్యామ్‌ నుంచి 30 వేల క్యూసెక్కులు స్పిల్‌ వే ద్వారా, మరో 2 వేల క్యూసెక్కులు పవర్‌హౌస్‌ ద్వారా విడుదలవుతున్నాయి. దీంతో జూరాలకు శనివారం నాటికి 50 వేలకుపైగా క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జూరాలకు వస్తున్న 10 వేల క్యూసెక్కుల ప్రవాహానికి ఎగువ ప్రవాహాలు జత కలిస్తే 6 టీఎంసీల నీరొచ్చే అవకాశముంది. ప్రస్తుతం జూరాలలో 9.66 టీఎంసీల నిల్వకుగాను 7.97 టీఎంసీల నిల్వ ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా శ్రీశైలానికి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీల నిల్వకుగాను 24.13 టీఎంసీలే ఉన్నాయి.
మరిన్ని వార్తలు