కోచింగ్ సెంటర్లు, బ్రోకర్లపై నిఘా

9 Sep, 2016 01:07 IST|Sakshi
కోచింగ్ సెంటర్లు, బ్రోకర్లపై నిఘా

* 11న ఎంసెట్-3కి ఏర్పాట్లు పూర్తి
* పోలీస్ ఉన్నతాధికారులతో ఎంసెట్ కమిటీ భేటీ
* బయోమెట్రిక్ పరికరాలను పెంచాలని నిర్ణయం
* నేడూ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం

సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న ఎంసెట్-3 పరీక్షకు ఎంసెట్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో తెలంగాణతోపాటు పక్క రాష్ట్రాల్లోనూ కార్పొరేట్ విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు, బ్రోకర్లపై ఇంటెలిజెన్స్, సీఐడీ నేతృత్వంలో పోలీసుశాఖ నిఘా పెట్టింది.

ముఖ్యంగా వచ్చే మూడు రోజులు బ్రోకర్ల కదలికలను పరిశీలించాలని, నిర్ణయించింది. ఏపీలో ఏర్పాటు చేసే 25 పరీక్ష కేంద్రాలపైనా పకడ్బందీ నిఘాకు చర్యలు చేపడుతోంది. ప్రశ్నపత్రాల విషయంలో ఇప్పటికే అడుగడుగునా నిఘా ఏర్పాటు చేసింది. గురువారం ఇక్కడి ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఎంసెట్ కమిటీ సమావేశమై నిఘా, పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించింది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంసెట్-3 చైర్మన్, జేఎన్‌టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్-3 కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ సీపీ వీవీ శ్రీనివాసరావు, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, లా అండ్ ఆర్డర్ డీఐజీ కల్పనా నాయక్ తదితరులు సమావేశమయ్యారు.

ఈసారి పరీక్షకు బయోమెట్రిక్ పరికరాలను పెంచాలని నిర్ణయించారు. గతంలో ప్రతి 250 మందికి ఒక బయోమెట్రిక్ పరికరం ఏర్పాటు చేయగా, ఈసారి ప్రతి 200 మంది విద్యార్థులకు ఒక పరికరం ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులను తనిఖీ చేసే ప్రదేశాల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మహిళా కానిస్టేబుళ్లను మోహరించడంతోపాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు. మరోవైపు హాల్‌టికెట్ నంబర్లలో మార్పులు చేశారు. వాటిని ఏడు అంకెల నుంచి ఎనిమిది అంకెలకు పెంచారు. పరీక్ష కేంద్రాలను కూడా జంబ్లింగ్ చేశారు. పాత పరీక్ష కేంద్రాల్లో ఏ విద్యార్థీ పరీక్ష రాసే అవకాశం లేకుండా కొత్త కేంద్రాల్లోనే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులకు కార్బన్‌లెస్ జవాబుల కాపీలను అందించనున్నారు.
 
నిమిషం ఆలస్యమైనా అనుమతించం: ప్రొఫెసర్ పాపిరెడ్డి
ఎంసెట్-3 పరీక్షకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలన్నారు. బయోమెట్రిక్ డేటా సేకరించాల్సి ఉన్నందువల్ల విద్యార్థులు 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం మంచిదన్నారు, ఉదయం 9 గంటల నుంచే వారిని పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు. 96 పరీక్ష కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 56,153 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు సిద్ధం చేశామన్నారు. గురువారం సాయంత్రం వరకు 33,169 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని, మిగతా విద్యార్థులు శుక్రవారం కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని పాపిరెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు