ముద్రణకు నోచుకోని పాఠ్య పుస్తకాలు!

13 Mar, 2016 05:06 IST|Sakshi
ముద్రణకు నోచుకోని పాఠ్య పుస్తకాలు!

♦ పబ్లిషర్లు, ప్రింటర్ల గొడవల్లో ఇరుక్కుపోయిన విద్యాశాఖ
♦ ప్రభుత్వ ఆధ్వర్యంలో సేల్ పుస్తకాల ముద్రణ?
♦ అయినా ఈ నెల 21 నుంచి పై తరగతుల బోధన అసాధ్యమే!
 
 సాక్షి, హైదరాబాద్: పబ్లిషర్లు, ప్రింటర్ల గొడవల్లో విద్యాశాఖ ఇరుక్కుపోయింది. ఫలితంగా ఈ నెల 21 నుంచి ప్రారంభం కావాల్సిన వచ్చే విద్యా సంవత్సరపు పాఠ్యాంశాల బోధనను ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. విద్యా వార్షిక కేలండర్ ప్రకారం ఈ నెల 21 నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు (ఏప్రిల్ 23 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు) పై తరగతుల బోధనను ప్రారంభించాలి. కానీ ప్రింటర్ల ఖరారు విషయంలో ముందస్తుగా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టలేకపోయిన అధికారులు, వారిపై ఓ ముఖ్య కార్యాలయం నుంచి వచ్చిన ఒత్తిడి, కోర్టు వివాదాలతో విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.

 పక్కాగాలేని ప్రభుత్వ ప్రణాళిక
 ఈ విద్యా సంవత్సరంలో పక్కా ప్రణాళిక మేరకు ముందుగానే పుస్తకాలను అందిస్తామని, మార్చి 21 నుంచే పైతరగతులకు సంబంధించిన విద్యాబోధనను ప్రారంభిస్తామని విద్యాశాఖ చెప్పింది. కాని కొంతమంది ప్రైవేటు పబ్లిషర్లు ప్రణాళిక ప్రకారం పన్నిన ఉచ్చులో పడి..పుస్తకాల ముద్రణకే మోక్షం లభించని పరిస్థితికి కారణమైంది. 2016-17 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రభుత్వ సిలబస్‌తో కూడిన పాఠ్య పుస్తకాలనే వినియోగించాలని ఈసారి ప్రభుత్వం నిబంధన విధించింది. అతిక్రమిస్తే ప్రైవేటు పాఠశాలలపైనా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. వివాదాల కారణంగా సేల్  పాఠ్య పుస్తకాల ముద్రణ విషయంలో ముద్రణ టెండర్లే ఖరారు కాకపోవడంతో విద్యాశాఖ ఆందోళనలో పడిం ది. ఇప్పటికిప్పుడు సేల్‌పుస్తకాలను తాము ముద్రించలేకపోయినా కనీసం జూన్ 13 నాటికైనా ప్రభుత్వ స్కూళ్లకు అవసరమైన 1.70 కోట్ల ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు అవసరమైన 1.50 కోట్ల సేల్ పుస్తకాలను తాము ముద్రిస్తే ఎలా ఉంటుం దున్న ఆలోచనలు చేస్తోంది. దీనిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మరిన్ని వార్తలు