తొలిసారిగా సోయా విత్తన ఉత్పత్తి

15 Feb, 2016 01:11 IST|Sakshi
తొలిసారిగా సోయా విత్తన ఉత్పత్తి

♦ రాష్ట్రంలో హాకా ద్వారా రైతుల నుంచి 30 వేల క్వింటాళ్ల సేకరణ
♦ 50 సోయాబీన్ విత్తన కాలనీలు... 100 ఉత్పత్తిదారుల బృందాలు
 
 సాక్షి, హైదరాబాద్:  రాష్ట్రంలో మొదటిసారిగా సోయాబీన్ విత్తన ఉత్పత్తి మొదలైంది. ఈ పంట వేసిన రైతుల నుంచి హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా) సోయాబీన్ విత్తనాలను సేకరించి వచ్చే ఖరీఫ్‌కు సిద్ధంగా ఉంచింది. రాష్ట్రంలో సోయాబీన్ పంటసాగు పట్ల రైతులు ఆసక్తి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇక్కడే విత్తనాన్ని సేకరించి విక్రయించేందుకు ఏర్పాట్లు చేసింది. వచ్చే ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాల్లో 30 వేల క్వింటాళ్లు సిద్ధంగా ఉంచినట్లు హాకా ఎండీ రాజేశం ‘సాక్షి’కి చెప్పారు.

 పక్క రాష్ట్రాల నుంచి...
 రాష్ట్రంలో సోయాబీన్ పంటకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. సోయా విత్తనాలు తెలంగాణలో అందుబాటులో లేకపోయినా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి మరీ రైతులు సోయా సాగు చేస్తున్నారు. గత ఖరీఫ్‌లో సాధారణంగా 4.45 లక్షల ఎకరాల్లో సోయా సాగు చేపట్టాల్సి ఉండగా... ఏకంగా 6.34 లక్షల ఎకరాల్లో (142%) సాగు చేశారు. అందులో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 3.31 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 2.30 లక్షల ఎకరాలు, మెదక్ జిల్లాలో 38,680 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 28,037 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 2,965 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 1,455 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 410 ఎకరాల్లో సాగు చేశారు.

ఈ విత్తనాలను రైతులు మహారాష్ట్ర నుంచి అధిక వ్యయంతో తీసుకొస్తూ సాగు చేస్తున్నారు. కొందరు దళారులు బ్లాక్ మార్కెట్లోనూ వీటిని విక్రయిస్తున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో 2 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా... హాకా ఈ ఏడాది  1300 మంది రైతులకు ఫౌండేషన్ సీడ్‌ను ఇచ్చి 6 వేల ఎకరాల్లో విత్తనాలను పండించింది. తద్వారా 30 వేల క్వింటాళ్లను సేకరించింది. బైబ్యాక్ ఒప్పందం చేసుకొని సోయాబీన్ విత్తనాలకు క్వింటాలుకు రూ. 5 వేల చొప్పున రైతులకు చెల్లించింది.  

 వచ్చే ఏడాది లక్ష క్వింటాళ్ల సేకరణ...
 2016-17లో లక్ష క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను సేకరించాలని హాకా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 25 వేల ఎకరాలకు అవసరమైన 6,250 క్వింటాళ్ల ఫౌండేషన్ సీడ్‌ను రైతులకు అందజేయాలని నిర్ణయించింది. కాగా, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 50 స్టోరేజీ, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం 50 విత్తన కాలనీలను నెలకొల్పాలని నిర్ణయించినట్లు హాకా ఎండీ రాజేశం తెలిపారు. అలాగే గ్రామం యూనిట్‌గా 100 సోయాబీన్ ఉత్పత్తిదారుల బృందాలను ఏర్పాటు చేయనున్నారు. వీరికి ప్రభుత్వం లేదా బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందించడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు