ముస్తఫాది హత్యే.. ఫోరెన్సిక్ నిపుణుల నిర్ధారణ

24 Oct, 2014 17:34 IST|Sakshi

మెహిదీపట్నం ఆర్మీ ప్రాంతంలో కొంతకాలం క్రితం జరిగిన హత్యపై ఫోరెన్సిక్ విభాగం కీలక నివేదిక సమర్పించింది. ముస్తఫాది హత్యేనని, అతడి ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టారని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిర్ధారించింది. అయితే అతడిపై లైంగిక దాడి మాత్రం జరగలేదని తెలిపారు. సంఘటన స్థలంలో ఉన్న కిరోసిన్, అతడి ఒంటిమీద పోసిన ఇంధనం ఒకటేనని కూడా తేల్చిచెప్పారు.

ముస్తఫాది హత్యేనని ఫోరెన్సిక్ నిపుణులు దాదాపుగా తేల్చడంతో.. ఇప్పుడు ఇక పోలీసు దర్యాప్తు చాలా కీలకంగా మారింది. ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. క్లూస్ టీం సిబ్బంది మొత్తం 24 రకాల ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణులకు అందించారు. సంఘటన స్థలంలో ఉన్న రక్తపు మరకలు ఎవరివనే విషయంపై తొలుత కొన్ని అనుమానాలు తలెత్తాయి. అయితే.. ముస్తఫాను కాపాడే క్రమంలో అతడి సోదరుడి చేతికి గాయాలయ్యాయని, అతడి రక్తమే అక్కడ మరకలుగా ఉందని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు. ఎవరు హత్యచేసి ఉంటారనే విషయం మాత్రం ఇంక పోలీసులు తేల్చాల్సి ఉంది. ఆర్మీ జవాన్ల చేశారా లేదా స్థానికులు ఎవరైనా ఈ హత్యకు పాల్పడి ఉంటారా అనే విషయం తేల్చాలి.

మరిన్ని వార్తలు