‘జోనల్’పై భిన్నాభిప్రాయాలు

13 Aug, 2016 01:53 IST|Sakshi
‘జోనల్’పై భిన్నాభిప్రాయాలు

సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జోనల్ వ్యవస్థపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశాయి. జోనల్ వ్యవస్థను రద్దు చేసి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో రెండంచెల ఉద్యోగ వ్యవస్థను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. జోనల్ స్ఫూర్తికి  విఘాతం కలుగకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో ప్రత్యేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయింది.

ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఉన్నతాధికారుల సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 30 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దసరా రోజున జిల్లాల ఏర్పాటుకు గడువు విధించిన తరహాలోనే.. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను దసరాలోగా పరిష్కరించాలని సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఆర్‌సీ బకాయిలను చెల్లించాలని, డీఏను చెల్లించాలని, హెల్త్‌కార్డులు జారీ చేయాలని కోరారు.
 
ఎవరేమన్నారంటే..
జోన్ల వ్యవస్థను రద్దు చేసి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో రెండంచెల ఉద్యోగ వ్యవస్థ ఉండాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి.మమత, ఏ.సత్యనారాయణ పేర్కొన్నారు. అవసరం లేని విభాగాలు, కార్పొరేషన్లను విలీనం చేసి, జోన్ల వ్యవస్థను రద్దు చేయాలని గ్రూప్-1 ఆఫీసర్ల అసోసియేషన్ ప్రతినిధులు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, హనుమంత్ నాయక్, శశికిరణాచారి విజ్ఞప్తి చేశారు. అందరికీ సమానావకాశాలు కల్పించేందుకు రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా తీసుకోవాలని పీఆర్‌టీయూ అధ్యక్ష కార్యదర్శులు సరోత్తమ్‌రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి ప్రతిపాదించారు.

జోనల్ వ్యవస్థను కొనసాగించాలని, ఆరు జోన్లుగా విభజించాలని యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు నర్సిరెడ్డి, చావ రవి కోరారు. కొత్త జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల వరకు 20 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని పీఆర్‌టీయూ-తెలంగాణ ప్రతినిధులు కోరారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలను ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని తెలంగాణ టీచర్స్ యూనియన్(టీటీయూ) అధ్యక్ష కార్యదర్శులు మణిపాల్‌రెడ్డి, వేణుగోపాలస్వామి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలను ఆరు జోన్లుగా విభజించాలని, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జిల్లా పోస్టులుగా, ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, గ్రేడ్-1, గ్రేడ్-2 గెజిటెడ్ హెచ్‌ఎంలను జోనల్ పోస్టులుగా గుర్తించాలని ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, సదానందగౌడ్ విజ్ఞప్తి చేశారు.
 
జోన్ల వ్యవస్థ అశాస్త్రీయం: టీఎన్‌జీవో
ప్రస్తుతం ఉన్న జోన్ల వ్యవస్థ శాస్త్రీయంగా లేదని, అందువల్ల ఇక ఈ వ్యవస్థ అక్కర్లేదని టీఎన్‌జీవో సంఘం ప్రతినిధులు దేవీ ప్రసాద్, కారెం రవీందర్‌రెడ్డి, హమీద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘‘సూపరింటెండెంట్ కేడర్ వరకు పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా భర్తీ చేయాలి. 80 శాతం లోకల్, 20 శాతం ఓపెన్ కేటగిరీకి కేటాయించాలి. ఆపై స్థాయి పోస్టుల్లో 30 శాతం ఓపెన్ కేటగిరీని మాత్రమే నేరుగా నియామకం చేపట్టాలి. మిగతా 70 శాతం ప్రమోషన్ల ద్వారా అన్ని జిల్లాలకు సమాన అవకాశమివ్వాలి.

హెచ్‌వోడీ కార్యాలయాల్లో 30 శాతం డెరైక్ట్ రిక్రూట్‌మెంట్, 70 శాతం ప్రమోషన్లు పాటించాలి. జిల్లా నుంచి హెచ్‌వోడీకి, సెక్రెటేరియట్‌కు, అక్కణ్నుంచి జిల్లాలకు బదిలీల విధానం ఉండాలి. జనాభాకు అనుగుణంగా పోస్టుల సంఖ్య పెంచాలి.  కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాల్లో ఇప్పుడున్న పోస్టుల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి. ఉన్న పోస్టులనే పంపిణీ చేయడం సరి కాదు’’ అని వారు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు