గురుకుల విద్యార్థులకు ఫౌండేషన్‌ కోర్సు

10 May, 2018 02:10 IST|Sakshi

కేంద్రీయ వర్సిటీలు, ప్రముఖ కాలేజీల్లో ప్రవేశాలకు శిక్షణ

శిక్షణకు ప్రఖ్యాత సంస్థలతో అవగాహన ఒప్పందం

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటివరకు ఇంటర్మీడియెట్‌ వరకు వసతితోపాటు ఉచిత విద్య అందిస్తుండగా.. తాజాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, దేశంలోని ప్రఖ్యాత కాలేజీల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తోంది.

ఆ కాలేజీల్లో సీటు వచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించనుంది. ఇందుకోసం ప్రముఖ శిక్షణ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ అందజేసింది. నెలాఖరులోగా ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

ప్రముఖ సంస్థలతో ఒప్పందం
ఇంటర్మీడియెట్‌ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్‌తోపాటు ఇతర రంగాలపైనా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలు రాష్ట్ర విద్యాసంస్థల వరకే పరిమితం అవుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో కోర్సు చదవాలంటే వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించాలి. అంతేకాకుండా ప్రఖ్యాత యూనివర్సిటీలు, కాలేజీల్లో సీట్లు సాధించాలంటే ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి.

ఆర్థికంగా వెనుకబడ్డ గురుకుల విద్యార్థులకు ఇవి రెండూ కష్టం. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. పట్టుదల, భారీ లక్ష్యాలున్న విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించనుంది. దీనికి సంబంధించిన శిక్షణ కోసం ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లతో అవగాహన కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ఉచితంగా మెటీరియల్‌ కూడా అందజేయనుంది. అలాగే ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకుతో సీటు సాధించిన వారి కోర్సు ఫీజును కూడా ఎస్సీ అభివృద్ధి శాఖ భరించనుంది.

పాఠశాల స్థాయి నుంచే శిక్షణ
లక్ష్యాల్ని నిర్దేశించుకునే విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే పలు దఫాలుగా శిక్షణ ఇప్పించేలా ఎస్సీ గురుకుల సొసైటీ ప్రణాళికను రూపొందించింది. ఇంటర్మీడియెట్‌ నుంచి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనుంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం అందుబాటులోకి రానుంది.

తొలుత జూనియర్‌ కాలేజీ స్థాయి ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలన్నింట్లోనూ ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే ఏడాది ఎస్సీ గురుకులాల్లోనూ దీనిని అందుబాటులోకి తేనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు