డ్రగ్స్‌ కేసులో మరో సంచలనం

21 Jul, 2017 09:18 IST|Sakshi
డ్రగ్స్‌ కేసులో మరో సంచలనం

హైదరాబాద్‌: డ్రగ్స్‌ దందాలో మరో సంచలనం. బడాబాబుల కుమారులు మాదక ద్రవ్యాల రాకెట్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా నలుగురు విద్యార్థులను పోలీసులు గుర్తించినట్టు సమాచారం. కెల్విన్‌ సృష్టించిన డార్క్‌నెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా వీరు తమ ఇంటి అడ్రస్‌లకు డ్రగ్స్‌ తెప్పించుకున్నట్టు తెలిసింది.

నలుగురు విద్యార్థులు ఐఏఎస్‌ అధికారి, డాక్టర్‌, బడా కంపెనీ డైరెక్టర్‌, స్టాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కుమారులుగా గుర్తించారు. వీరంతా ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదివినట్టు తెలుస్తోంది. కెల్విన్‌తో వీరికి సంబంధాలున్నట్టు సమాచారం. వీరికి తరచుగా  డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు విచారణలో కెల్విన్‌ వెల్లడించినట్టు తెలిసింది. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా నలుగురు విద్యార్థులను పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించినట్టు సమాచారం. అయితే దీనిపై ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు అధికారికంగా సమాచారం వెల్లడించలేదు. ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో చదువుతున్న వారిలో చాలా మంది విద్యార్థులు కెల్విన్‌కు రెగ్యులర్‌ కస్టమర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు డ్రగ్స్‌ కేసులో సినీ పరిశ్రమకు చెందిన వారిని సిట్‌ అధికారులు ప్రశ్నించారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌, కెమెరామెన్‌ శ్యామ్‌ కే నాయుడులను సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. నేడు నటుడు సుబ్బరాజును సిట్‌ అధికారులు ప్రశ్నించనున్నారు.