అలీ రజ్వీ కేసును ఛేదించిన పోలీసులు : నలుగురి రిమాండ్

14 Aug, 2013 04:25 IST|Sakshi

రౌడీషీటర్ మజ్హర్ అలీ రజ్వీ హత్య కేసు మిస్టరీని 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తుండడంతోనే అతడ్ని హతమార్చినట్లు తేల్చారు. ఈ మేరకు నలుగురు నిందితులను రెయిన్‌బజార్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ తరుణ్ జోషి మీర్‌చౌక్ ఏసీపీ గంగాధర్, ఇన్‌స్పెక్టర్ రంగారావులతో కలిసి వివరాలు వెల్లడించారు. పంజేషా గుల్జార్‌హౌస్ ఫాతుల్లా బేగ్ ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి మాజిద్ (20) చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడు. ఈ విషయం తెలిసిన డబీర్‌పురా కోమటివాడి ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ అయిన రౌడీషీటర్ మజ్హర్ నుంచి పోలీసులు రహస్యంగా వివరాలు సేకరిస్తున్నారు. దీంతో అతడు మాజిద్‌ను కలసి పోలీసులకు చెబుతానంటూ పలుమార్లు డబ్బులు డిమాండ్ చేశాడు.

కొన్ని రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతుడటంతో మజ్హార్‌ను అడ్డు తొలగించాలని మాజిద్ పథకం వేశాడు. స్నేహితులు యాకుత్‌పురా ముర్తుజానగర్ ప్రాంతానికి చెందిన తాఖీ అలీ అలియాస్ చోటు (23), పంజేషా గుర్నగల్లీ ప్రాంతానికి చెందిన మీర్జా ఫజిల్ నమాజీ అలియాస్ ఫజిల్ (24), బార్కాస్ ఎర్రకుంట ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ షేక్ అబ్బు అలియాస్ వాజిద్ (21)ల సాయం కోరాడు. డబ్బులు ఇస్తామని మజ్హార్‌ను నమ్మించి సోమవారం అర్ధరాత్రి మౌలాకా చిల్లా గంగానగర్ నాలా శ్మశానవాటిక వద్దకు రప్పించి కత్తితో పొడిచి బండరాళ్లను మోది దారుణంగా హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహకారంతో మంగళవారం నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, మృతుడు, నిందితులపై పలు ఠాణాల్లో కేసులున్నాయి. మీర్జా ఫజిల్‌పై ఎలాంటి కేసులు లేవు.

>
మరిన్ని వార్తలు