కొత్త సచివాలయంలో 4 ప్రార్థనా మందిరాలు

6 Jul, 2016 02:15 IST|Sakshi

- ముందుగా సీ, డీ బ్లాక్‌ల కూల్చివేత
- మెయిన్ గేట్ పక్కనున్న విద్యుత్ ఎస్‌ఈ భవనం స్వాధీనం
- ఎల్ బ్లాక్ మినహా అన్ని బ్లాక్‌ల అప్పగింతకు ఏపీ ఆమోదం

 
 సాక్షి, హైదరాబాద్: వచ్చే శ్రావణ మాసంలో కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. నిర్మాణ నమూనాకు అనుగుణంగా ప్రస్తుత భవనాల కూల్చివేత, వాటిలోని కార్యాలయాల తరలింపుపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. ఇప్పుడున్న సచివాలయ స్థలంలోనే  ‘యు’ ఆకారంలో కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు అధునాతన డిజైన్‌కు  ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆమోదం తెలిపారు. కొత్త నిర్మాణం చేపట్టేందుకు వీలుగా ముందుగా సీఎం కార్యాలయమున్న ‘సి’ బ్లాక్‌తో పాటు ‘డి’ బ్లాక్‌ను కూల్చివేయాలని నిర్ణయించారు.
 
 వాటిలోని సీఎం ఆఫీసుతో పాటు మంత్రుల కార్యాలయాలను సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు తరలించాలని తొలుత యోచించిన అధికారులు ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు. ఏపీ ప్రభుత్వం శరవేగంగా తన కార్యాలయాలను అమరావతికి తరలిస్తున్నందున ఏపీ సచివాలయంలో ఖాళీ అవుతున్న బ్లాక్‌లను వాడుకునే దిశగా యోచిస్తున్నారు. ఏపీ శాఖలు కొన్ని ఇప్పటికే కార్యాలయాలు ఖాళీ చేసి వెళ్లాయి. దాంతో ఎల్ బ్లాక్ మినహా జే, హెచ్, హెచ్ సౌత్ బ్లాక్‌లను నెలాఖరుకల్లా తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. సీ, డీ బ్లాకుల్లోని కార్యాలయాలను వాటిలో సర్దుబాటు చేయాలని అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక భవనాల ఆలోచనను విరమించుకున్నారు.
 
 తాజా నిర్మాణ నమూనా: కూల్చివేత తర్వాత సచివాలయ స్థలాన్ని వాస్తుకు అనుగుణంగా మార్చనున్నారు. కొత్త నిర్మాణ నమూనా ప్రకారం ఏ, బీ బ్లాకులను ఖాళీ చేసే అవసరం లేదు. సచివాలయం దక్షిణం వైపున ఉన్న స్థలాన్ని మొత్తంగా వేరు చేయనున్నారు. ఏ, బీ బ్లాకులు, ఏపీ క్యాంటీన్, తెలంగాణ క్యాంటీన్, ఎల్ బ్లాకు వరకు వేరు చేసేలా తూర్పు నుంచి పడమర వరకు గోడ నిర్మిస్తారు. సచివాలయంలో ఇప్పుడున్న ప్రార్థనా మందిరాలను సెక్రటేరియట్ నుంచి వేరు చేసిన దక్షిణ స్థలంలో నిర్మిస్తారు.
 
 అమ్మవారి గుడి, మసీదు, చర్చితో పాటు గురుద్వారా నిర్మించాలని యోచిస్తున్నారు. మెయిన్ రోడ్ వైపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తారు. ప్రత్యామ్నాయంగా తెలంగాణ సచివాలయ మెయిన్ గేట్‌కు కుడి పక్కన నిజాం కాలంలో నిర్మించిన భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు.  ప్రస్తుతమున్న విద్యుత్ శాఖ ఎస్‌ఈ కార్యాలయాన్ని మరో చోటికి తరలిస్తారు. సి, డిబ్లాకులతో పాటు ఈ భవనాన్ని కూల్చివేస్తే మొత్తం స్థలం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుందని  అధికారులు చెబుతున్నారు. నిర్దేశిత డిజైన్ మేరకు ఈ ప్రదేశాన్ని చదును చేసి మూడు బ్లాకులుగా నిర్మాణాలు చేపడతారు.

మరిన్ని వార్తలు