పోలీసులమంటూ దోపిడీ

24 Apr, 2015 02:12 IST|Sakshi
పోలీసులమంటూ దోపిడీ

నలుగురు సూడో పోలీసుల అరెస్టు
రూ.59 వేల నగదు,ఆటో, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం

 
సుల్తాన్‌బజార్ : సీసీఎస్ పోలీసులమని చెప్పి విద్యార్థులను చితకబాది.. వారి వద్ద డబ్బు, సెల్‌ఫోన్లు దోచుకున్న నలుగురు కేటుగాళ్లను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల నుంచి  9 సెల్‌ఫోన్‌లు, రూ.59 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సుల్తాన్‌బజార్  ఏసీపీ రావుల గిరిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీ నగర్ శ్రీనగర్‌కాలనీకి చెందిన ఈ.హనుమంతు, మీర్‌పేట్ తిరుమలహిల్స్‌కు చెందిన నల్ల భార్గవ్, గాయత్రినగర్‌కు చెందిన అశోక్ డిగ్రీ చదువుతున్నారు. ఈనెల 13న కాచిగూడ లింగంపల్లిలోని నృపతుంగ కళాశాలలో డిగ్రీ పరీక్షలు రాసిన వారు తమ ఐఫోన్ రిపేర్ చేయించుకొనేందుకు కోఠి గుజరాతి గల్లీలోని దేవి మొబైల్‌షాపునకు వచ్చారు.

అదే సమయంలో నాంపల్లి అఫ్జల్‌సాగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్‌అలీ (28), ఫలక్‌నూమా కుర్మవాడికి చెందిన మహ్మద్ సోహిల్ అలీ(25), మల్లేపల్లికి చెందిన సయ్యద్ సాజిద్‌అలీ(32), హబీబ్‌నగర్‌కు చెందిన మహ్మద్ అజార్(18) దేవీ మొబైల్‌షాప్‌కు వచ్చారు. తాము సీసీఎస్ పోలీసులమని విద్యార్థులపై దాడి చేశారు. వారిని కొట్టుకుంటూ ఆటో (ఏపీ 12 వి 8426)లో తీసుకెళ్లారు. భరత్ అనే విద్యార్థిని పాతబస్తీ సిటీకాలేజీ వద్ద విడిచి పెట్టారు. హనుమంతు వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లు లాక్కొని అతడిని కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో, అశోక్ వద్ద రూ.700లు లాక్కొని అతడిని రాజేంద్రనగర్‌లో విడిచిపెట్టారు.

దోపిడీకి గురైన విద్యార్థులు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రెండు బృందాలను రంగంలోకి దింపారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. నిందితుల్లో ఇద్దరు పాతనేరస్తులు ఉన్నట్లు నిర్థారణైంది.  కాగా, నిందితులు గురువారం మరో దోపిడీ వేసేందుకు దారుస్సలాం వచ్చి టీ తాగుతూ పోలీసులకు చిక్కారు. 

నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. జల్సాల కోసం పోలీసుల అవతారమెత్తి విద్యార్థులను దోచుకున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి 9 సెల్‌ఫోన్‌లు, ఆటో, రూ.59 వేలు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌లు జి.శ్రీనివాస్, అంజయ్య, డీఐ కిశోర్‌బాబు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు