నాలుగేళ్లలో ఎగుమతులు డబుల్

1 Feb, 2016 04:18 IST|Sakshi
నాలుగేళ్లలో ఎగుమతులు డబుల్

♦ ఎక్స్‌పోర్ట్ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
♦ ప్రస్తుత వార్షిక ఎగుమతులు రూ.లక్ష కోట్లు
♦ డ్రైపోర్టులు, జలమార్గాల అభివృద్ధిపై దృష్టి
♦ ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రణాళిక
 
 సాక్షి, హైదరాబాద్: సరుకుల ఎగుమతులను వచ్చే నాలుగేళ్లలో రెండింతలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఏటా రూ.లక్ష కోట్ల విలువ చేసే ఎగుమతులు జరుగుతుండగా.. 2019-20 నాటికి రూ.2 లక్షల కోట్లకు చేర్చాలని నిర్ణయించింది. నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ ద్వారా ఇప్పటికే రూ.25 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతోపాటు ఫార్మాసిటీ, నిమ్జ్, మెడికల్ డివెజైస్, టెక్స్‌టైల్, సుగంధ ద్రవ్యాల పార్కుల వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పురుడు పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎగుమతులను ప్రోత్సహించేలా నూతన విధానంలో పొందుపరచాల్సిన విధివిధానాలపై కసరత్తు చేస్తోంది.

ఎగుమతులపరంగా రాష్ట్రవాటా 1.93 శాతం కాగా.. దేశంలో 12వ స్థానంలో వుంది. రాష్ట్రం నుంచి ప్రధానంగా ఫార్మా, బల్క్‌డ్రగ్, వ్యవసాయ, సాగు ఆధారిత ఉత్పత్తులు, యంత్ర సామగ్రి, చేనేత, వస్త్ర, హస్త కళా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. వీటితోపాటు కార్పెట్లు, వజ్రాభరణాలు, రక్షణ, ఏరోస్పేస్ ఉత్పత్తులు.. గ్రానైట్, బెరైటీస్, ఫెల్‌స్పార్, క్వార్ట్జ్ తదితర ముడి ఖనిజాలు ఎగుమతి అవుతున్నాయి. నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా లైఫ్‌సెన్సైస్, ఐటీ, హార్డ్‌వేర్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, చేనేత, వస్త్ర పరిశ్రమ.. తదితర 14 ప్రధాన రంగాలకు పరిశ్రమల శాఖ ప్రత్యేక పాలసీలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఎగుమతుల విధానం రూపకల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పరిశ్రమల శాఖ కార్యదర్శిని ఎగుమతుల కమిషనర్‌గా నియమిస్తూ.. పాలసీ విధి విధానాలు రూపొందించే బాధ్యత అప్పగించింది. మరోవైపు దీనిపై సూచనలు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది.

 డ్రైపోర్టులు.. జల మార్గాలు
 రాష్ట్రం చుట్టూ భూభాగం ఆవరించి ఉండటంతో నూతన విధానంలో డ్రైపోర్టుల ఏర్పాటును ప్రతిపాదిస్తూ.. సాధ్యాసాధ్యాలపై నివేదిక కోరారు. ఈ మేరకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే కన్సల్టెన్సీ రాష్ట్రంలో రెండు చోట్ల డ్రైపోర్టుల ఏర్పాటును ప్రతిపాదించింది. ఒక్కో డ్రైపోర్టు ఏర్పాటుకు 1,200 ఎకరాల భూమి, రూ.3,020 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. అయితే వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి వుంది. పొరుగు రాష్ట్రాల్లోని నౌకాశ్రయాలను కలుపుతూ కృష్ణా, గోదావరి నదీ జలమార్గాల అభివృద్ధికి కేంద్ర సాయం కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
 హైదరాబాద్‌లో ట్రేడ్ సెంటర్
 మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా ఫార్మాసిటీ, వరంగల్ టెక్స్‌టైల్ పార్కు, పాశమైలారం పారిశ్రామిక పార్కులో ఉమ్మడి కాలుష్య శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు మేధో సంపత్తి కేంద్రాలు ఉండగా.. వీటి సంఖ్యను మరింత పెంచడం ద్వారా మేధో సంపత్తి హక్కులు, ట్రేడ్‌మార్కుల రిజిస్ట్రేషన్ తదితరాలకు రక్షణ కల్పిస్తారు. చెన్నై ట్రేడ్ సెంటర్, బెంగుళూరు ట్రేడ్ సెంటర్ తరహాలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ట్రేడ్ సెంటర్ స్థాపించాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని వాణిజ్య సంస్థలన్నింటినీ ఒకే వేదిక మీదకు తెచ్చేలా తెలంగాణ వాణిజ్య భవనం పేరిట ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను నిర్మిస్తారు.

అపెడా వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో ఉమ్మడి ప్యాకేజింగ్, స్టోరేజీ సపోర్ట్, ఎగుమతి విధానాలు, నిబంధనలు తదితరాలపై ఎగుమతిదారులకు శిక్షణ ఇస్తారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్యత్ బంధు పథకం ద్వారా కోరాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎగుమతులకు అనువైన వాతావరణం, అవరోధాలు, మౌలిక సౌకర్యాల కల్పనపై ఇప్పటికే స్థూల అవగాహనకు వచ్చామని.. త్వరలో నూతన విధానం రూపొందించి ముఖ్యమంత్రి పరిశీలనకు పంపుతామని పరిశ్రమల శాఖ వర్గాలు చెప్పాయి.

మరిన్ని వార్తలు