పరిమళించిన మానవత్వం

17 Jul, 2015 00:08 IST|Sakshi

‘సాక్షి’ కథనంపై విశేషంగా స్పందించిన దాతలు
అనాథ విద్యార్థి చదువుకు ఆర్థిక చేయూత

 
 నాగోలు: ‘చదువు కొనలేని సరస్వతీ పుత్రుడు’ శీర్షికతో ఈ నెల 11న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వార్తను చదివిన దయార్థ హృదయులు అనాథ బాలుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. దాదాపు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేసి మానవత్వాన్ని చాటారు. ఎల్‌బీనగర్‌కు చెందిన అనాథ విద్యార్థి గృహం స్టూడెంట్ కె.జీవన్ ఎన్‌ఐటీలో సీటు సంపాదించాడు. అయితే నాలుగేళ్ల కోర్సులో ఫీజుల చెల్లింపు, పుస్తకాల కొనుగోలుకు డబ్బులు లేకపోవడంతో సీటును వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

చిన్నతనంలోనే కన్నవారిని కోల్పోయి అనాథగా మారినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించిన జీవన్ గురించి ‘సాక్షి’ చక్కగా వివరించింది. దీనిపై స్పందించిన దాతలు రాజరాజేశ్వరి రూ.50,016, సంజయ్ రూ.21 వేలు, పుష్పలత రూ.20 వేలు, ఇంద్రషీలారాణి రూ.20 వేలు, యువసేన ట్రస్ట్ యూ.ఎస్.ఏ రూ.16 వేలు, జస్టిస్ ఎం.ఎన్.రావు రూ.10 వేలు, నిఖిల్ రూ.10 వేలు, మరికొంత మంది దాతలు రూ.54 వేలు అందజేశారు. ‘సాక్షి’ చేసిన అక్షర సాయం వల్ల జీవన్‌కు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందింది. దీనిపై అనాథ విద్యార్థుల వసతి గృహం ప్రధాన కార్యదర్శి మార్గం రాజేష్ ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు