హైదరాబాద్‌తో ఫ్రెంచ్‌ కవలల అనుబంధం

19 Nov, 2016 19:15 IST|Sakshi
హైదరాబాద్‌తో ఫ్రెంచ్‌ కవలల అనుబంధం

హైదరాబాద్: తమ తాత, ముత్తాతలు నివసించిన ప్రాంతాలను సందర్శించేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు హైదరాబాద్‌కు వచ్చారు. గత కొద్ది రోజుల నుంచి ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించి అక్కడ తమ తాత ముత్తాతల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టేన్ హోవే(25), కమీలా(25) ఇద్దరూ కవలలు. ఇద్దరికీ చదువుతో పాటు పర్వతారోహణ అంటే ఎంతో ఇష్టం. ఇందులో భాగంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడ పర్వతారోహణతో పాటు చరిత్రను అధ్యయనం చేస్తున్నారు. ఇండియాలో పర్యటించాలని తలపెట్టినప్పుడు వీరి తల్లి కేట్ కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపింది.

వీరి ముత్తాత థియోడోర్ టస్కర్ హైదరాబాద్ రాష్ట్రానికి 1927- 1943 వరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూగా పనిచేశారని.. తన భార్య జెఫీ టస్కర్‌తో కలిసి ఆదర్శనగర్ పక్కన ఉన్న ఇప్పటి రిడ్జ్ హోటల్‌లో ఉండే వారని ఆధారాలు అందజేసింది. దీంతో అక్కాచెల్లెళ్లు ఈ నెల 7వ తేదీన నగర పర్యటనకు వచ్చి, రిడ్జ్ హోటల్‌ను సందర్శించారు. ఇక్కడ తన ముత్తాత 17 ఏళ్ల పాటు అధికారికంగా నివాసంగా ఉండేవారు. అదే సమయంలో కౌన్సిల్ మెంబర్ ఆఫ్ హైదరాబాద్‌లో కూడా ఆయన పని చేశారని వెల్లడించారు.

కొడెకైనాల్‌లో పుట్టి పెరిగిన టస్కర్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనకు హ్యారీ టస్కర్ అనే కొడుకు హైదరాబాద్‌లోనే జన్మించాడు. హ్యారీ కూతురు కేట్ కాగా కేట్ పిల్లలే క్రిస్టేన్, కమీలా. ఇక్కడ టస్కర్‌ పనిచేస్తున్న సమయంలోనే ఆయనకు జూబ్లీహాలులో జరిగిన కార్యక్రమంలో ’సర్’ అనే బిరుదును బ్రిటిష్ ప్రభుత్వం అందజేసింది. చౌమొహల్లా ప్యాలెస్‌ను సందర్శించినప్పుడు తన ముత్తాత భార్య జెఫీ ఫొటో కూడా ప్రిన్సెస్ నిలోఫర్ పక్కన చూశామని వీరు తెలిపారు.


తన ముత్తాత ప్రతి విషయాన్ని డైరీలో రాసేవారని.. ఆ డైరీని తన తాత హ్యారీకి ఇవ్వగా చనిపోయే ముందు హ్యారీ ఆ డైరీని తన తల్లి కేట్‌కు ఇచ్చారని దీనివల్లనే తమకు హైదరాబాద్‌తోఉన్న అనుబంధం తెలిసిందని వారు తెలిపారు. హైదరాబాద్‌లో తమ మూలాలు ఉన్నాయని తెలుసుకొని ఎంతో సంతోషపడ్డామని వీరు తెలిపారు. సౌత్ ఫ్రాన్స్‌లో నివసిస్తున్న వీరు ప్రస్తుతం ఫిమేల్ అడ్వెంచర్స్‌పై డాక్యుమెంటరీ తీసే పనిలో నిమగ్నమయ్యారు. రాక్ క్లైంబింగ్‌లో ఆసక్తి ఉన్న నగరానికి చెందిన గచ్చిబౌలి వాసి రిత్విక్‌రెడ్డి నివాసంలో వీరు బస చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన వీరు పలు గుట్టలను కూడా ఎక్కి సరదా తీర్చుకున్నారు. శనివారం నగర పర్యటన ముగించుకుని తన ముత్తాత ఊరైన కొడెకైనాల్‌కు బయల్దేరారు.

మరిన్ని వార్తలు