మైనార్టీలకు నాణ్యమైన ఉచిత విద్య

24 Apr, 2016 04:21 IST|Sakshi
మైనార్టీలకు నాణ్యమైన ఉచిత విద్య

వెబ్‌సైట్‌ను ప్రారంభించిన
డిప్యూటీ సీఎం మహమూద్

 సాక్షి, హైదరాబాద్: మైనార్టీలకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన ఉచిత గురుకుల విద్య అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న 71 మైనార్టీ రెసిడెన్సియల్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లల్లో ప్రవేశాల కోసం శనివారం హైదరాబాద్‌లోని హజ్‌హౌస్‌లో వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సర్వేల ద్వారా మైనార్టీల సమస్యలను గుర్తించి సరికొత్త పథకాల ద్వారా పరిష్కార మార్గాలు చూపుతోందని, వారి వెనుకబాటుతనానికి నిరక్షరాస్యతే ప్రధాన కారణమన్నారు.

బాలికలకు పూర్తిగా భద్రతతో కూడిన విద్య, వసతి కల్పించేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మైనార్టీ గురుకులాల్లో ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని ఏసీబీ డీజీ, తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ పాఠశాలల సంస్థల సొసైటీ(టీఎంఆర్‌ఈఐఎస్) వైస్ చైర్మన్ ఏకే ఖాన్ వెల్లడించారు. గురుకులాలలో ప్రవేశాల కోసం ఈ నెల 23 నుంచి  మే 15 వరకు ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్ http://tmreis.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు హజ్‌హౌస్‌లోని హెల్ప్‌లైన్ 7331170780/81/82/83/84/85లకు సంప్రదించవచ్చన్నారు. ఈ సందర్భంగా 10 ప్రచార రథాలను ప్రారంభించారు.

>
మరిన్ని వార్తలు