హైహై... వైఫై!

16 Dec, 2015 04:15 IST|Sakshi
హైహై... వైఫై!

ఫ్రీ వైఫైకి విశేష స్పందన
నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్‌లు టాప్
త్వరలో నగర వ్యాప్తంగా
3 వేల హాట్‌స్పాట్‌లు

బీఎస్‌ఎన్‌ఎల్ సన్నాహాలు

సిటీబ్యూరో: ఉచిత వైఫై సేవలకు సిటీజనుల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలు ఈ విషయంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. నగరంలో 15 చోట్ల బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ 20 నిమిషాల చొప్పున ఉచితంగా వైఫై సేవలు అందించేందుకు హాట్‌స్పాట్ పరికరాలు ఏర్పాటు చేసింది. క్రమంగా వీటి సంఖ్య పెంచుతోంది. దీనికి స్పందన అదే స్థాయిలో ఉంటోంది. నెక్లెస్ రోడ్‌లో వారానికి సగటున 79,076 సెషన్స్ మేర ఉచిత వైఫై వినియోగమవుతోందని... 8.83 టెరాబైట్ల డేటాను వినియోగదారులు వాడుకున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ట్యాంక్‌బండ్ వద్ద 61,745 సెషన్ల మేర 10.63 టెరాబైట్ల డేటా వినియోగించినట్లు తెలిసింది. ఆ తరవాత స్థానంలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంది. కనిష్టంగా బిర్లా ప్లానిటోరియం వద్ద 503 సెషన్స్, నిమ్స్ వద్ద 580 సెషన్స్ మేర వైఫై వినియోగిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ వర్గాలు తెలిపాయి.
 
3 వేల హాట్‌స్పాట్లు

 నగర వ్యాప్తంగా వైఫై సేవల విస్తరణకు 3 వేల హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు  చేయాలని సంస్థ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు ఆలస్యం కావడం... హాట్‌స్పాట్‌లకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఈ పనులు ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వపరంగా సహకారం అందితే మరో ఆరు నెలల్లో 3 వేల హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ చెబుతోంది. నగరంలో తమ సంస్థకు 4,500 కి.మీ మేర ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అందుబాటులో ఉందని ప్రకటించింది.
 
వినియోగంలో సమస్యలివీ..

 ఉచిత వైఫై వినియోగంలో పలుమార్లు సమస్యలు ఎదురవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఒకేసారి వందలాది మంది వైఫై సేవలకు ప్రయత్నిస్తే నిరాశే ఎదురవుతోంది. స్పీడ్ తగ్గుతోందని... ఒక్కోసారి కనెక్ట్ కావడం లేదని నెక్లెస్ రోడ్‌పై వైఫై వినియోగిస్తున్న పలువురు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినపుడు సేవలు అందడం లేదని చెబుతున్నారు. హాట్‌స్పాట్ పరికరాల సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు.
 
వినియోగించే తీరిదీ
మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆప్షన్‌ను క్లిక్ చే సి మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్‌మిట్ చేయాలి.ఆ తరవాత మొబైల్‌కు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎస్‌ఎంఎస్ రూపంలో అందుతాయి.రెండో బాక్సులో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ టైప్‌చేసి లాగిన్ కావాలి. అపుడు 20 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలు అందుతాయి.ఆ తరవాత వినియోగించేందుకు ప్రతి అరగంటకు రూ.30 చార్జీ అవుతుంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. లేదా హాట్‌స్పాట్‌లు ఉన్నచోట బీఎస్‌ఎన్‌ఎల్ విక్రయించే కూపన్లను కొనుగోలు చేయవచ్చు.
 
ప్రయోజనాలివీ..

ఆన్‌లైన్‌లో అనుసంధానించినసుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచ్చు. వెఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటే చాలు.. మొబైల్ డేటా నెట్‌వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగించే వీలుంటుంది. కేబుల్ కనెక్షన్లతో అవసరం ఉండదు. ఆన్‌లైన్ ద్వారా ఒకే టీవీలో అన్ని చానళ్లు వీక్షించే వీలుంటుంది.ఒకే కనెక్షన్‌పై ఒకటి కన్నా ఎక్కువ మంది మాట్లాడుకునే యాక్సెస్ లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు సేవలే కాకుండా కొన్ని రకాల యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు. ఉదాహరణకు పార్కింగ్ యాప్, గార్బేజ్ యాప్ వంటివి. ఈ యాప్ సేవలతో నగరం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయి.

>
మరిన్ని వార్తలు