ఏదమ్మా.. ముంబై స్పీడ్‌?

18 May, 2017 01:18 IST|Sakshi
ఏదమ్మా.. ముంబై స్పీడ్‌?

ఎంఎంటీఎస్‌కు ఎన్నిబ్రేకులో..!
తరచూ ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు


నగరంలో ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ అంటే ఓ భరోసా.. సమయానికి వెళతామనే ధీమా.. అయితే రోజు రోజుకూ ఆ నమ్మకం సన్నగిల్లుతోంది.. కారణం ఆలస్యం.. ఎప్పుడు చూసినా ఇంతే..  

సిటీబ్యూరో:   సికింద్రాబాద్‌ నుంచి లింగంపల్లికి వెళ్లే  రైల్వేమార్గంలో  హుస్సేన్‌సాగర్‌ జంక్షన్‌ వద్ద  బుధవారం ఉన్నట్టుండి సాంకేతిక సమస్య తలెత్తింది. సిగ్నళ్లు  స్తంభించాయి. దాంతో ఎంఎంటీఎస్‌ రైళ్లతోపాటు కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా నిలిపివేశారు.  అయితే ఎంఎంటీఎస్‌ రైల్‌ నెట్‌వర్క్‌కు మాత్రం  తీవ్ర అంతరాయం కలిగింది. కొద్దిసేపట్లోనే  సాంకేతిక సమస్యలను  పరిష్కరించినప్పటికీ  ఎంఎంటీఎస్‌ రైళ్లు  ఆలస్యంగానే నడిచాయి. సికింద్రాబాద్‌–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి  లైన్‌లలో కొన్ని సర్వీసులను పాక్షికంగా, మరి కొన్నింటిని పూర్తిగా రద్దు చేశారు. ఉదయం  10.30 గంటల సమయంలో ఉత్పన్నమైన ఈ  సమస్య వల్ల   వేలాది మంది ప్రయాణికులు  తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక్క బుధవారం మాత్రమే కాదు. నగరంలోని  రైల్వే  ట్రాక్‌లపై ఎక్కడ ఏ చిన్న అవాంతరమొచ్చి పడ్డా  ఠక్కున ఆగిపోయేది  ఎంఎంటీఎస్‌ రైళ్లే. ప్రతి రోజు 121 సర్వీసులలో  సుమారు లక్షా  50 వేల మంది ప్రయాణికులు  వినియోగించుకొనే ఎంఎంటీఎస్‌ రైళ్ల కోసం ఒక ట్రాక్‌  ప్రత్యేకంగా ఉండాలనే ప్రతిపాదన దశాబ్దాలు గడిచినా అమలుకు నోచుకోలేదు.

పడిగాపులే..
హుస్సేన్‌సాగర్‌  జంక్షన్‌ వద్ద  సిగ్నలింగ్‌  వ్యవస్థ నిలిచిపోవడం వల్ల   బుధవారం ఒక్క ఎంఎంటీఎస్‌ రైళ్లే కాదు.  రాయలసీమ ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎక్స్‌ప్రెస్, వరంగల్‌ పుష్‌ఫుల్‌  ప్యాసింజర్‌  రైళ్లను కూడా కొద్ది సేపు నిలిచిపోయాయి. కానీ   ఎక్కువ  సర్వీసులు మాత్రం ఎంఎంటీఎస్‌  రైళ్లే. సికింద్రాబాద్, లింగంపల్లి–

ఫలక్‌నుమా, లింగంపల్లి–నాంపల్లి, సికింద్రాబాద్‌–లింగంపల్లి, తదితర మార్గాల్లో   ఎక్కడో  ఒక చోట  ఏ ఒక్క ఎంఎంటీఎస్‌ రైలు ఆగినా దాని తరువాత వచ్చే  రైళ్లన్నింటికీ  బ్రేక్‌పడుతుంది. ఒక్క  ట్రైన్‌  10 నిమిషాలు ఆలస్యంగా నడిచినా  ఆ తరువాత నడిచే  రైళ్లు  అరగంట  నుంచి  45 నిమిషాల జాప్యానికి  గురవుతాయి. సిగ్నలింగ్‌ వ్యవస్థకు  మరమ్మతులు చేసిన వెంటనే ఎక్స్‌ప్రెస్‌  రైళ్లను  ముందు  క్లియర్‌  చేశారు.ఆ తరువాత  ఎంఎంటీఎస్‌  రైళ్లను నడిపారు. ఉదయం  5  గంటల నుంచి  10  గంటల వరకు, తిరిగి సాయంత్రం  4 నుంచి  8 గంటల  వరకు  ఈ  రైళ్ల నిర్వహణలో జాప్యం చోటుచేసుకుంటుంది.

ప్రత్యేక లైన్‌ లేకపోవడమే..
‘రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కంటే ఎంఎంటీఎస్‌ రైళ్లకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని, నిమిషం ఆలస్యంగా నడిచినా  ప్రయాణికులు ఇబ్బంది పడతారు’ అని  ఈ రైళ్లను ప్రారంభించినప్పుడు ప్రభుత్వం అభిప్రాయపడింది. కానీ ఆ స్ఫూర్తి ఏనాడో కొరవడింది. ఎంఎంటీఎస్‌కు ప్రత్యేకంగా లైన్‌లు లేకపోవడం వల్ల  అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ప్రతి రోజు 85 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, వందకు పైగా ప్యాసింజర్‌ రైళ్లు, ఎంఎంటీఎస్‌లు రాకపోకలు సాగిస్తాయి. అన్ని రైళ్లకు కేవలం 10 ప్లాట్‌ఫామ్‌లే. ఒకరైలు కదిలితే తప్ప మరో రైలు ప్లాట్‌ఫామ్‌పైకి రాలేదు.  

అమలు కాని సమయ పాలన
ముంబై సబర్బన్‌ రైళ్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఐదు నిమిషాల ఆలస్యానికి   తావు లేకుండా అక్కడ వందల కొద్దీ రైళ్లను నడుపుతున్నారు. సమయపాలనకు  అక్కడి రైళ్లు పెట్టింది పేరు. హైదరాబాద్‌లోనూ  అదే తరహాలో  సేవలందజేయనున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఇందుకోసం సబర్బన్‌  తరహాలోనే  అప్పట్లో చార్జీలు పెంచారు. అయితే సమయపాలన మాత్రం అమలుకు నోచలేదు. మొదట్లో  కొంతకాలం బాగానే  నడిచినప్పటికీ  తరచుగా  ఎంఎంటీఎస్‌  రైళ్ల రాకపోకల్లో  జాప్యం చోటుచేసుకుంటూనే ఉంది. సికింద్రాబాద్‌ నుంచి, నాంపల్లి నుంచి హైటెక్‌సిటీ, మాదాపూర్, తదితర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు, లింగంపల్లి నుంచి  ఇటు సికింద్రాబాద్, లకిడికాపూల్, నెక్లెస్‌రోడ్డు, సెక్రరెటేరియట్, తదితర ప్రాంతాలకు వెళ్లే  ప్రయాణికులు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు