16 నుంచి స్కూళ్లలో డిజిటల్ తరగతులు

10 Nov, 2016 04:26 IST|Sakshi
16 నుంచి స్కూళ్లలో డిజిటల్ తరగతులు

2 వేలకు పైగా స్కూళ్లలో అమలు
ఈ నెల 11 నుంచి 14 వరకు ట్రయల్ రన్
డిజిటలైజేషన్‌కు సదుపాయాలు కల్పించండి
కలెక్టర్లకు, డీఈవోలకు డిప్యుటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో డిజిటల్ తరగతులను ఈ నెల 16 నుంచి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, డీఈవోలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. పాఠశాలల డిజిటలైజేషన్‌పై బుధవారం కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే గుర్తించిన 2 వేలకు పైగా పాఠశాలల్లో డిజిటల్ తరగతుల బోధనకు అవసరమైన అన్ని సదుపాయాలు, సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో ట్రయల్న్ర్ నిర్వహించాలన్నారు.

ప్రతి స్కూల్లో కంప్యూటర్లు, విద్యుత్తు సరఫరా, ఆర్‌వోటీలు, కేబుల్ కనెక్షన్లు సరిగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని, టీచర్ల శిక్షణ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఒకసారి ప్రారంభించిన తరువాత సాంకేతిక, ఇతర కారణాలతో మధ్యలో ఆగిపోయే పరిస్థితి రావద్దన్నారు. మొదటి దశలో 2 వేలకు పైగా స్కూళ్లలో ప్రారంభిస్తామని, ఆ తరువాత దశల వారీగా మిగతా పాఠశాలలకు విస్తరిస్తామన్నారు. 16వ తేదీన కార్యక్రమం ప్రారంభానికి జిల్లాల్లో ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, లేనిచోట అధికారులు ప్రారంభించాలన్నారు.
 
డిజిటలైజేషన్‌కు చర్యలు చేపట్టాలి
డిజిటలైజేషన్‌లో సంక్షేమ పాఠశాలలు ముందంజలో ఉన్నాయని, మిగతా స్కూళ్లు కూడా అందుకు అనుణంగా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పేర్కొన్నారు. ఈనెల 11కల్లా కార్యక్రమం ప్రారంభించేం దుకు సిద్ధంగా ఉన్న స్కూళ్ల తుది జాబితాను అందజేయాలన్నారు. హార్డ్‌వేర్‌కు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేం దుకు జిల్లాల్లో జిల్లా మేనేజర్లు అందుబాటులో ఉన్నారని ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. వారితోపాటు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కూడా అందుబాటులో ఉన్నారని, వారికి శిక్షణ ఇచ్చామన్నారు.

అన్ని జిల్లాల్లో డిసెంబర్ 31కల్లా కేబుల్ ఆపరేటర్లతో ఒప్పందాలు పూర్తవుతాయన్నా రు. హైదరాబాద్‌లో ప్రతి స్కూల్‌కు ఈ కార్యక్రమం కోసం కేబుల్ ఆపరే టర్లు ముందుకువచ్చి వారి ఖర్చుతో కేబుల్ కనెక్షన్లు, సెట్ టాప్ బాక్సులు అందిస్తున్నా రన్నారు. మిగిలిగిన జిల్లాల్లో కూడా కలెక్టర్లు ఇలాంటి ప్రయత్నాలు చేయాలన్నారు.
 
ప్రాథమికంగా డిజిటల్ తరగతులు ప్రారంభించే స్కూళ్ల సంఖ్య
► 1,769 ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు
► 391 కస్తూర్బా గాంధీ  బాలిక విద్యాలయాలు
► 192 మోడల్ స్కూళ్లు
► 48 విద్యాశాఖ గురుకులాలు
► 234 సంక్షేమ శాఖల గురుకులాలు.

మరిన్ని వార్తలు