నెలాఖరు నుంచి అసెంబ్లీ

27 Aug, 2016 04:56 IST|Sakshi
నెలాఖరు నుంచి అసెంబ్లీ

* లేదా సెప్టెంబర్ 17 నుంచి సమావేశాలు
* గణేశ్ నవరాత్రుల దృష్ట్యా సర్కారు మల్లగుల్లాలు

సాక్షి, హైదరాబాద్: గణేశ్ నవరాత్రుల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నెల 30 నుంచి లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. జీఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించేందుకు వీలైనంత త్వరగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు సన్నాహాలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి.

దీంతో ఏపీ కంటే ముందే జీఎస్టీ బిల్లును ఆమోదించి పంపేందుకు వీలుగా ఈ నెలాఖరునే సమావేశాలు ప్రారంభించాలనే ప్రతిపాదన వచ్చింది. కేవలం మూడు రోజుల పాటు సమావేశాలు జరిపి, తొలి రోజునే జీఎస్టీ బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది. మరోవైపు గణేశ్ నవరాత్రుల దృష్యా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు ఇబ్బందులు తలెత్తకుండా... నిమజ్జనోత్సవం ముగిశాక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయాన్ని కూడా సర్కారు పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి పోలీసు విభాగం నుంచి అందిన సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు.

మొత్తంగా ఈ నెల 30వ తేదీ నుంచిగానీ లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచిగానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి తీసుకునే తుది నిర్ణయం మేరకు తేదీ ఖరారవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును ఆమోదించాయి.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సెప్టెంబర్ తొలివారంలో బిల్లును ఆమోదించి పంపిస్తామని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు సమాచారమిచ్చాయి. జీఎస్టీ బిల్లుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వీలైనంత తొందరగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ శాసనసభ సమావేశాల్లోనే దేవాదాయ శాఖ చట్ట సవరణ బిల్లు, ఎస్టీ, మైనారిటీల స్థితిగతులపై సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ ఇచ్చిన నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

మరిన్ని వార్తలు