నేటి నుంచి పాలిసెట్ తుదివిడత కౌన్సెలింగ్

3 Jul, 2016 03:28 IST|Sakshi
నేటి నుంచి పాలిసెట్ తుదివిడత కౌన్సెలింగ్

- రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
- 6న సీట్లు కేటాయించనున్న సాంకేతిక విద్యామండలి
 
 సాక్షి, హైదరాబాద్: పాలిసెట్-2016 ర్యాంకర్లకు తుదివిడత కౌన్సెలింగ్  ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యామండలి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 21 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు (తొలివిడతలో వెరిఫికేషన్ చేయించుకోని) అభ్యర్థులు హాజరుకావచ్చు. వీరితో పాటు మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరైనా ఏ కళాశాలలోనూ సీటు రాని అభ్యర్థులు, ఒకవేళ సీటు పొందినప్పటికీ కళాశాల లేదా కోర్సును మార్చుకోవాలనుకుంటున్న అభ్యర్థులు కూడా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులకు ఈ నెల 6న సాయంత్రం ఆరుగంటల తరువాత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. తుదివిడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారు ఆయా కళాశాలల్లో ఈ నెల 8లోగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

 అందుబాటులో 25 వేల సీట్లు
 తుది విడత కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంకా 24,948 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 205 పాలిటెక్నిక్ కాలేజీల్లో 50,632 సీట్లుం డగా, తొలివిడత కౌన్సెలింగ్‌లో కేవలం 25,684 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం తాజాగా తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియను సాంకేతిక విద్యామండలి ప్రారంభించింది.
 
 సప్లిమెంటరీ అభ్యర్థులకు అవకాశం లేనట్టే
 పాలిసెట్‌లో ర్యాంకులు పొంది టెన్త్ ఫెయిలైన అభ్యర్థులకు తుదివిడత కౌన్సెలింగ్‌లో అవకాశం లేకుండా పోయింది. వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ ఏడాది భారీగా సీట్లు మిగిలిపోవడంతో టెన్త్ సప్లిమెంటరీలో పాసైన అభ్యర్థులకు అవకాశమివ్వాలని తొలుత సాంకేతిక విద్యామండలి భావించినప్పటికీ.. సప్లిమెంటరీ ఫలితాల విడుదలలో విద్యాశాఖ నుంచి స్పష్టమైన సమాచారం అందలేదని తెలుస్తోంది. దీంతో రెండో విడత ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇబ్బంది కలగకూడదని భావించిన సాంకేతిక విద్యామండలి అధికారులు.. తాజాగా తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టారు. స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ నాటికి ఫలితాలు వస్తే టెన్త్ సప్లిమెంటరీలో పాసైన అభ్యర్థులకు పాలిటెక్నిక్‌లలో చేరేందుకు చివరి అవకాశం లభించనుంది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా