ఆలస్యం చేసేయ్‌.. అంచనాలు పెంచేయ్‌!

8 Jun, 2017 03:23 IST|Sakshi
ఆలస్యం చేసేయ్‌.. అంచనాలు పెంచేయ్‌!
ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణంలో ‘ఎస్కలేషన్‌’ మాయ
- ఏళ్లపాటు జాప్యం చేసి అంచనాలు పెంచే యత్నం
ఒప్పందంలో లేని పనులు.. నిబంధనలు బేఖాతరు
- ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో కన్నం
 
సాక్షి, హైదరాబాద్‌: ఓ పెద్ద నిర్మాణ పని మొదలవుతుంది. కానీ.. గడువులోపు పూర్తి చేయరు. పలు కారణాలతో జాప్యం చేస్తారు. ఈలోపు నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయన్న కారణంతో నిర్మాణ అంచనా విలువను  ఆకాశా నికెత్తేస్తారు.  దీనికి అధికారులూ ఓకే అంటారు. అందుకవసరమయ్యే సంతకాలన్నీ పడిపోతా యి. చివరకు ప్రభుత్వం కొత్త అంచనా విలువకు తగ్గట్టుగా బిల్లులు విడుదల చేస్తుంది. దీంతో నిర్మాణ ‘కథ’ సుఖాంతమవుతుంది. ప్రభుత్వ ఖజానాకు మాత్రం భారీ నష్టం జరుగుతుంది.

ఇదీ రోడ్లు భవనాల శాఖలో తరచూ జరిగే వ్యవహారం!! ప్రస్తుతం ఇంద్రభవనాన్ని తలపిం చేలా ఉన్న ఆ శాఖ భవన నిర్మాణంలోనూ ఇదే జరిగింది. రూ.25 కోట్లతో పూర్తవ్వాల్సిన భవనా నికి రూ.65 కోట్ల లెక్కలు తేల్చి ఖజానాకు సున్నం కొట్టేశారు. ఇప్పుడు సాక్షాత్తూ శాసన సభ్యుల నివాస సముదాయం విషయంలోనూ దీన్నే పునరావృతం చేసేందుకు సిద్ధమయ్యారు.. గతంలో పనిచేసిన కొందరు అధికారులు. వారిలో కొందరు పదవీ విరమణ చేయగా.. కొందరు బదిలీ అయ్యారు.

అంచనా విలువ అమాంతం పెంచాల్సి రావటంతో ప్రస్తుత అధి కారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. నిబం ధనలకు విరుద్ధంగా ప్రైస్‌ ఎస్కలేషన్‌  చేయడం, ఒప్పందంలో లేని పనులను చేర్చడం, టెండ ర్లతో సంబంధం లేకుండా అదనపు పనులు అప్పగించడం.. వెరసి మూడున్నరేళ్ల జాప్యం చేసి అంచనా విలువను భారీగా పెంచాల్సిన పరిస్థితికి తెచ్చారు. ఎమ్మెల్యేల నివాస సముదా యంలోనే ఇలా జరగటంతో ఎస్కలేషన్‌కు అను మతించాలా? లేదా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలా అని అధికారులు యోచిస్తున్నారు.
 
పనుల్లో మార్పులు..
సాధారణంగా ఒప్పంద గడువులోపు పని చేయ కుంటే లిక్విడేటెడ్‌ డ్యామేజి పేరుతో నిర్మాణ విలువలో 10% వరకు ప్రభుత్వమే నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేయాలి. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌. ఒప్పందంలో అనుకున్న పనులే జర గాలి. మార్పులకు అవకాశం ఉండొద్దు. కానీ గతంలో పనిచేసిన అధికారులు కొందరు  మార్పులు (డీవియేషన్స్‌) చేయాలని ఒప్పందం లో లేని పనులు చేయించారు. నిజానికి దీనికి విడిగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను ఖరారు చేసి పని అప్పగించాలి.

కానీ ఆ నిబంధనను తుంగలో తొక్కారు. దీనివెనక ఉమ్మడి రాష్ట్రంలో ఓ ముఖ్య నేత బంధువు హస్తముందని ఆరోపణలు విని పిస్తున్నాయి. ఆయన కన్సల్టెన్సీ బాధ్యత చూశారని, దీన్ని నామినేషన్‌ పద్ధతిలో ఇప్పించి, ఆ పేరిట రూ.3 కోట్లు ఖర్చు చూపారని సమాచారం. గతంలో రాజ్‌భవన్‌ సిబ్బంది క్వార్టర్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే గవర్నరే గుర్తించి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం బిల్డింగ్‌ విభాగంలో భారీ మార్పులు చేశారు. చీఫ్‌ ఇంజనీర్‌ను తప్పించి జాతీయ రహదారుల విభాగం ఈఎన్‌సీ గణపతిరెడ్డికి బాధ్యతలు అప్పగిం చారు. ఎమ్మెల్యే క్వార్టర్ల విషయంలో నిబం ధనల ఉల్లంఘనలు కనిపించటంతో గణపతి రెడ్డి ఆచితూచి వ్యవహరించారు.
 
ఇదీ సంగతి..
హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌లో ఎమ్మెల్యే భవనాలు పాతపడిపోవటంతో.. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్లకు అనుబంధంగా 120 క్వార్టర్లతో భారీ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఇందుకు 2012 ఆగస్టులో ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం జరిగింది. రూ.132 కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా.. నిర్మాణ సంస్థ 5.58 శాతం లెస్‌కు పనులను దక్కించుకుంది. దీంతో నిర్మాణ విలువ రూ.125 కోట్లుగా మారింది. 18 నెలల్లో అంటే.. 2014 జనవరి నాటికి పనులు పూర్తి చేసి భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ ఇప్పటికీ జరగలేదు. ఇటీవలే మంత్రి తుమ్మల తనిఖీ చేసి జాప్యం జరగడంపై నిర్మాణ సంస్థ, అధికారులపై మండిపడ్డారు. ఈ జాప్యం వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంచనా విలువను పెంచేసి ఖజానాకు గండికొట్టాలని చూస్తున్నారని, రూ.40 కోట్ల వరకు అంచనా పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
నిబంధనల జాడేది?
సాధారణంగా నిర్మాణ సామగ్రి ధర పెరిగితే ప్రైస్‌ ఎస్కలేషన్‌కు అనుమతి స్తారు. కానీ.. ఒప్పంద గడువులోపు పనులు జరిగితేనే ఈ వెసులుబాటు ఉంటుంది. కానీ ఎమ్మెల్యే క్వార్టర్ల  విష యంలో ఇన్నేళ్లు జాప్యం జరిగినా ఆ నిబంధనను బేఖాతరు చేశారు. ఇప్పటికే పలుసార్లు రూ.కోట్లలో ఎస్కలేషన్‌కు అవ కాశం కల్పించారు. జాప్యానికి ప్రభుత్వ పరమైన కారణాలుంటే అంచనా విలు వను పెంచుకోవచ్చు. కానీ.. పనులు ప్రారంభమైనప్పట్నుంచీ ఇప్పటిదాకా పలు సందర్భాల్లో అధికారులు నిర్మాణ సంస్థకు జాప్యంపై లేఖలు రాశారు. ఒప్పంద గడువు మేరకు పనులు జరగటం లేదని, పనుల వేగాన్ని పెంచాల న్నది వాటి సారాంశం కావటం విశేషం.
 
నివేదిక వచ్చాక చర్యలు: మంత్రి తుమ్మల
ఎమ్మెల్యేల కొత్త క్వా ర్టర్ల సముదాయ నిర్మాణ ప్రక్రియ గందరగోళంగా ఉంది. నిర్మాణ నాణ్యత లో సందేహాలు లేనప్ప టికీ.. తీవ్ర జాప్యం, ప్రైస్‌ ఎస్కలేషన్, అంచనా వ్యయం పెంచాల్సి రావటం వంటివి అభ్యంతరకరమే. వీటిపై పూర్తి వివరాలు అందజేయాల్సిందిగా ఈఎన్‌సీని ఆదేశిం చాను. నివేదిక అందిన తర్వాత చర్యలపై నిర్ణయం తీసుకుంటా. రెండు మూడు నెలల్లో భవన సముదాయాన్ని ప్రారంభిస్తాం.
మరిన్ని వార్తలు