గాంధీ’ సాక్షిగా వైద్యుల తగాదా

7 Mar, 2014 02:34 IST|Sakshi
 • విధులను బహిష్కరించిన అనస్థీషియా వైద్యులు
 •      నిలిచిపోయిన 90 శస్త్రచికిత్సలు
 •      ఇబ్బందుల్లో రోగులు
 •      రాజీ కుదిర్చిన సూపరింటెండెంట్
 •  గాంధీ ఆస్పత్రి, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యుల మధ్య జరిగిన వివాదం రోగులకు శాపంగా మారింది. అనస్థీషియా వైద్యులు విధులను బహిష్కరించడంతో గురువారం జరగాల్సిన 90  శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్.. రాజీ కుదర్చడంతో విధులకు హాజరయ్యారు. గాంధీ ఆస్పత్రి ఆర్థోపెడిక్ హెచ్‌ఓడీ రవిబాబు బుధవారం.. మొదటి అం తస్తులోని ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లేటప్పటికీ అతని కుర్చీలో అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగార్జున కూర్చున్నారు.

  ‘నా కుర్చీలోనే ఎందుకు కూర్చున్నావు.. లెగు’ అన్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన నాగార్జున విషయాన్ని సహచర వైద్యులకు చెప్పడంతో వివాదం ముదిరింది. సూపరింటెండెంట్ ఇరువురికి సర్దిచెప్పిడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. గురువారం ఉదయం అనస్థీషీయా విభాగ వైద్యులంతా సమావేశమై రవిబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తు హఠాత్తుగా విధులను బహిష్కరించారు. శస్త్రచికిత్సల్లో వీరే కీలకం కావడంతో ఆస్పత్రిలోని 26 థియేటర్లలో ఆపరేషన్లు నిలిచిపోయాయి.

  దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆపరేషన్ టేబుల్‌పై గంటల తరబడి ఎదురుచూసినా వైద్యులు రాకపోవడంతో విషయం తెలుసుకున్న రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఇరువర్గాలకు చెందిన వైద్యులను సమావేశపర్చి చర్చించారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడంతో విధులకు హజరయ్యేందుకు అన స్థీషియా వైద్యులు అంగీకరించారు. చివరకు వివాదం సద్దుమణిగింది.
   
  పోలీసుల ఆరా..
   
  గాంధీ ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు నిలిచిపోయావని మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు పెద్దసంఖ్యలో గాంధీ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. ఉత్తరమండలం డీసీపీ జయలక్ష్మీ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీసీ పీవై గిరి, గోపాలపురం ఏసీపీ వసంతరావు, చిలకలగూడ సీఐ మోహన్‌లతోపాటు స్పెషల్‌బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులు గాంధీలో జరుగుతున్న వివాదాంపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎలర్ట్‌గా ఉన్నట్లు ఈ ఘటన రుజువుచేసింది.
   
   ఆరోగ్యశ్రీ నుంచి తప్పించాలనే..

   గాంధీ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ ర్యాంకో చీఫ్‌గా ఉన్న తనను ఆ పదవి నుంచి తప్పించాలనే తప్పడు ఆరోపణలు చేస్తున్నారు. నా కుర్చీలో కూర్చున్న నాగార్జునను అక్కడి నుంచి లెమ్మని చెప్పానే తప్ప మరే మీ అనలేదు. కావాలనే నాపై తప్పడు ప్రచారం చేస్తున్నారు.
   - రవిబాబు, ఆర్థోపెడిక్ హెచ్‌ఓడీ
   
   పునరావృతమైతే చర్యలు
   చిన్నవిషయమే వివాదానికి కారణం. ఫలితంగా మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు 45 ఆపరేషన్లు నిలిచిపోయాయి. అందుకే వివాదానికి కారణమైన వైద్యులిద్దరికీ మెమోలు ఇచ్చాం. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు.    
  - చంద్రశేఖర్, సూపరింటెండెంట్
   

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు