భాగ్యనగరిలో బాపూ అడుగుజాడలు

2 Oct, 2013 09:13 IST|Sakshi
భాగ్యనగరిలో బాపూ అడుగుజాడలు
మహాత్మాగాంధీ... తెల్లవారి దాస్యశృంఖలాల నుంచి భారతమాతకు విముక్తి కల్పించిన మహా యోధుడు. అహింస అనే ఆయుధంతో ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు. అక్టోబర్ రెండున గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని విశ్వవిద్యాలయాల్లో వెయ్యి మంది విద్యార్థులను ఆయన గురించి తమ అభిప్రాయం చెప్పమని కోరాం. మెజారిటీ యువత గాంధీని స్వాతంత్య్రోద్యమ రథసారథిగా భావిస్తోంది. 51 శాతం మంది స్వాతంత్య్ర సమరయోధుడిగా గాంధీని చూస్తే.. మరో 49 శాతం మంది సత్యనిష్ట 
కలిగిన స్వచ్ఛమైన వ్యక్తిగా చూస్తున్నారు. గాంధీ మళ్లీ పుడితే ఫ్రెండ్‌షిప్ చేస్తామని కొందరు, అవినీతిపై పోరాడమని సూచిస్తామని మరికొందరు చెబుతున్నారు.
 
సాక్షి, సిటీబ్యూరో : మహత్తరమైన అహింసా సిద్ధాంతంతో భరత జాతిని తన వెంట నడిపించిన మహా యోధుడు గాంధీజీ. ఆ మహనీయుడి జ్ఞాపకాలు భాగ్యనగరి మదిలో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. బాపూజీ హైదరాబాద్ నగరంలో పలు మార్లు పర్యటించారు. నిజాం రాజ్యంలో గాంధీ పర్యటన అప్పటికే ప్రజల్లో నిబిడీకృతమై ఉన్న స్వరాజ్య కాంక్షను సమున్నతంగా ఆవిష్కరించింది. సత్యాగ్రహ, సహాయ నిరాకరణ వంటి ఉద్యమాలతో మమేకమవుతోన్న ప్రజల్లో గాంధీజీ ఆగమనం మరింత ఉద్యమ స్ఫూర్తిని నింపింది. పలుమార్లు  ఆయన నగరాన్ని సందర్శించినప్పటికీ రెండు ముఖ్యమైన సందర్భాలను నగరవాసులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. 1934 మార్చి 9వ తేదీన గాంధీజీ హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను సందర్శించినట్లు స్వాతంత్య్ర సమరయోధులు నర్రా మాధవరావు చెప్పారు.
 
1934లో  ఆయన సికింద్రాబాద్‌లోని కర్బలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారని, అప్పటికి 13 ఏళ్ల వయస్సు ఉన్న తాను ఆ బహిరంగ సభలో పాల్గొని హరిజన నిధి కోసం బంగారు ఉంగరాన్ని అందజేశానని నర్రా మాధవరావు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘కర్బలా మైదానంలో సాయంత్రం 4కి సభ జరిగింది. హరిజన నిధి కోసం అందరూ  గడియారాలు, బంగారు, వెండి ఆభరణాలు అందజేశారు. కులనిర్మూలన కోసం అందరూ ఒక్కటి కావాలని గాంధీ తన ప్రసంగంలో ప్రజ లకు బోధించారు. ఆ సభలోనే ఒక పిల్లవాడు తాను వేసిన గాంధీ పెయింటింగ్‌ను ఆయనకు అందజేశాడు. ఆ చిత్రాన్ని మహాత్ముడు వేలం వేశాడు. 17 రూపాయలొచ్చాయి. సభ జరిగినంత సేపు అంతా మంత్రముగ్ధులయ్యారు. గాంధీతో పాటు సరోజినీనాయుడు, మదన్‌మోహన్ మాలవ్య ఆ సభలో పాల్గొన్నారు. సభ ముగిసిన తర్వాత తిరిగి ఆయన కార్లో వెళ్లేటపుడు గాంధీని దగ్గరగా చూడాలనే కుతూహలం కొద్ది కారు ఫుట్‌బోర్డుపైకి ఎక్కాను.‘బచ్చా ఉత్రో ఉత్రో’ అంటూ ఆయన నన్ను చేత్తో కిందకు నెట్టారు. ఆ స్పర్శ నాకు ఇప్పటికీ మరిచిపోలేని అనుభూతి’’ అని చెప్పారు.
 
 
గాంధీజీ ఆశీర్వాదంతో ఆనందం
నగరానికి వచ్చిన గాంధీజీ ఒళ్లో కూర్చొని అక్షరాలు దిద్దిన ఒకప్పటి పోలీసు ఉన్నతాధికారి గొంగిరెడ్డి రాఘవరెడ్డి జ్ఞాపకాలివీ...‘‘రావి నారాయణరెడ్డి మా బంధువు. అప్పటికాయన జాతీయోద్యమంలో ఉన్నారు. మహా త్ముడి పిలుపు మేరకు హరిజన హాస్టల్‌ను ప్రారంభించాలనుకొన్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్ దగ్గర రెండు గదులున్న ఇల్లు అద్దెకు తీసుకొన్నారు. ఆ హాస్టల్‌లో ఉండి చదువుకొనేందుకు 40మంది హరిజన విద్యార్థులను కూడా పోగుజేశారు. గాంధీజీ చేతుల మీదుగా దానిని ప్రారంభించాలని ఆశించారు. 1936, మార్చి 9వ తేదీన గాంధీజీ ఇక్కడికి వచ్చారు. ఇపుడు అబిడ్స్‌లో పుల్లారెడ్డి మిఠాయి దుకాణానికి ఎదురుగా సరోజినినాయుడు ఇల్లు గోల్డెన్ త్రిషోల్డ్. గాంధీజీ వారి ఇంట్లో బస చేశారు. ఆ మరుసటి రోజు వివేకవర్ధిని స్కూల్లో జరిగిన ప్రార్ధనల్లో పాల్గొన్నారు. అయితే అదే రోజు హరిజన హాస్టల్‌ను ప్రారంభించేందుకు గాంధీజీని ఆహ్వానించారు రావినారాయణరెడ్డి. ‘‘ఆ హాస్టల్‌లో ఎవరుంటున్నారు’’ అని అడిగారు గాంధీజీ. ‘‘ నలభై మంది మాల, మాదిగ పిల్లలు’’ అని చెప్పారు రావి.
 
అయితే నేను రాను’’ అన్నారాయన.
రావి నారాయణరెడ్డికి, ఇతర సహచరులకు ఏం చేయాలో అర్థం కాలేదు. బాపూజీ ఎందుకలా అన్నారో తెలుసుకోలేకపోయారు. కొద్ది సేపు మౌనం తర్వాత..‘‘ నలభై మంది మాల, మాదిగ పిల్లలే ఉన్నారు. కానీ ఒక్కరైనా ఇతర కులాల వాళ్లు ఉన్నారా..’’అని గాంధీ ప్రశ్నించారు. ‘‘లేరు సార్’’ అని చెప్పారు రావి. సరిగ్గా ఆ సమయంలో నా వైపు చూశారు. రావి మదిలో మెరుపులాంటి ఆలోచన. ‘‘సార్ ఈ పిల్లవాడు. రెడ్డి కులానికి చెందిన అనాథ. ఈ హాస్టల్లోనే వాళ్లతో పాటు ఉండి చదువుకొంటాడు.’’అని చెప్పాడు. అలా నేను హరిజన హాస్టల్‌లో గాంధీజీ చేతుల మీదుగా చేరాను. హాస్టల్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకొన్నారు. ‘‘ అచ్చా పడ్‌లేనా బేటా... అచ్చా నామ్ లేకే ఆనా..’’ అని ఆశీర్వదించారు. ఆ తర్వాత హరిజన విద్యార్థులతో ‘‘మీరంతా హరిజనులు. అంటరానితనం తొలగించడానికి ఒక జమీందారి బిడ్డ మీతో కలిసి ఉంటున్నాడు..’’ అని పరిచయం చేశారు. ఆ హాస్టల్లో చదువున్న మహేం ద్రనాథ్ ఆర్థిక మంత్రి అయ్యారు. బీకె పెంటయ్య ఐఏఎస్ అయ్యారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. నేను ఐపిఎస్ అయ్యాను’’ అని చెప్పారు. 
 
గాంధీ మార్గం అనుసర ణీయం...
‘తరాలు.... యుగాలు గడిచినా జాతిపిత మహాత్మాగాంది జీవనం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే’ ... ఇదీ నేటి యువత అభిప్రాయం. గాంధి జయంతి పురస్కరించుకొని న్యూస్‌లైన్ పలువురితో ముచ్చటించింది. గాంధిపై వారు తమ అభిప్రాయాలను నిష్కర్షగా చెప్పారు. గాంధీ భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని వారు కొనియాడారు. గాంధీ ప్రవచించిన అహింస సిద్ధాంతం కాలాతీతమైందని, దానికి మరణం లేదని అన్నారు. ప్రపంచం గాంధీ బోధించిన మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. - సాక్షి, సిటీబ్యూరో
 
అందరికీ ఆదర్శప్రాయం
గాంధీ చూపిన మార్గం అనుసరణీయం.  అహింసా మార్గంలో ఆయన చేసిన స్వాతంత్య్ర ఉద్యమం అందరికీ ఆదర్శప్రాయమైంది. - వెంకటేశ్ చౌహాన్, పీహెచ్‌డీ విద్యార్థి
 
గాంధీ జీవితాన్ని అధ్యయనం చేయాలి
మహాత్మాగాంధీ జీవితాన్ని అందరూ అధ్యయనం చేయాలి. అన్ని స్థాయిల్లో గాంధీ పోరాటాలు పాఠ్యాంశంగా తీసుకు రావాలి. గాంధీ జయంతిని ఘనంగా జరుపుకోవడం అవసరం. - హరిబాబు, ఎంఫిల్ విద్యార్థి
 
అవినీతిపై ఉద్యమం చేపట్టాలి 
సమాజంలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలించేందుకు మరో అహింసాయుత ఉద్యమం చేపట్టాలి. గాంధీ ప్రబోధాలను విరివిగా ప్రచారం చేయాలి.ఙఞ్చట- అభిలాష్, జూనియర్ డాక్టర్, గాంధీ ఆస్పత్రి
 
ఎంజీ రోడ్
క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం దేశవ్యాప్త పర్యటనలు చేసిన మహాత్మాగాంధీ స్వాతంత్య్రానికి ముందు సికింద్రాబాద్‌కు వచ్చారు. కర్బలామైదానంలో ప్రసంగించేందుకు గాను అప్పటి జేమ్స్‌స్ట్రీట్ గుండా పాదయాత్ర చేశారు. మహాత్ముడు నడిచిన ఈ దారికి మహాత్మాగాంధీ రోడ్ (ఎంజీ రోడ్) అని నామకరణం చేశారు. ఇందుకు గుర్తుగా ఇక్కడి వ్యాపారులు ఎంజీరోడ్‌లో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు రెండు కిలోమీటర్లు ఉండే ఈ రహదారి స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వాణిజ్యప్రాంతం. ప్యారడైజ్ హోటల్, చర్మాస్, కేఎఫ్‌సీ, రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్, రాణిగంజ్ బస్‌డిపో ఈ రహదారిలోనే ఉన్నాయి.
 
మరిన్ని వార్తలు