‘గాంధీ’ ఫార్మసీకి తాళం

25 Nov, 2014 00:48 IST|Sakshi

* ఉద్యోగుల మధ్య గొడవే కారణం!
* మందుల కోసం ఆందోళనకు దిగిన రోగులు

 గాంధీ ఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇరువురు ఉద్యోగుల మధ్య తలెత్తిన ఘర్షణతో ఫార్మసీకి తాళం పడింది. దీంతో మందుల కోసం రోగులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ వృద్ధురాలు సోమవారం ఉదయం  ఓపీ విభాగంలో వైద్యపరీక్షలు చేయించుకుంది. ైవైద్యుడు ఉచితంగా ఇచ్చే మందులను ఫార్మసీలో తీసుకొమ్మని చీటీ రాసి ఇచ్చాడు. దాన్ని వృద్ధురాలు పోగొట్టుకుంది. గాంధీ ఆస్పత్రి ఓపీ విభాగంలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్న జగదీష్ వృద్ధురాలి పరిస్థితి గమనించి కంప్యూటరీ ఓపీ చిట్టీపై ఉన్న మందులను మరో కాగితంపై రాసిచ్చాడు. దీనికి ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి నవీన్ తీవ్ర అభ్యంతరం తెలపడంతో వాగ్వివాదం జరిగింది.

ఈదశలో నవీన్ ఫార్మసీకి తాళం వేసి సూరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. రోగులకు మందులు అందక ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి అధికారులు వెంటనే ఫార్మసీని తెరిపించి మందులు ఇప్పించారు. రోగుల మధ్య తొక్కిసలాట జరగడంతో అవుట్‌పోస్ట్, స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్ధారు. ఇటువంటి ఘటనలు జరగడం పట్ల ఆస్పత్రి పాలనాయంత్రాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు