కేసీఆర్‌కు రైతులు కనిపించరా?: గండ్ర

26 May, 2016 03:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా, రైతులు తీవ్ర నిరాశానిస్పృహలో ఉన్నా సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదా అని పీసీసీ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని, వెంటనే ఏకమొత్తంగా పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ల సదస్సులో రైతు రుణమాఫీ, కరువు గురించి ప్రస్తావిస్తారని, సమస్యలను పరిష్కరిస్తారని ఆశించినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.

బ్యాంకర్లతో సీఎం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, రైతులకు కొత్త రుణాలు ఇచ్చేలా ఆదేశాలివ్వాలన్నారు. ప్రజలు పక్కరాష్ట్రాలకు వలసలు పోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదన్నారు. దేశంలో కాంగ్రెస్ సీఎంలకు ఒక న్యాయం, కాంగ్రెసేతర సీఎంలకు మరో న్యాయం అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ఓటుకు కోట్లు కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు