-

వైభవంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర..

15 Sep, 2016 19:50 IST|Sakshi

హైదరాబాద్ : అశేష భక్తజన జయజయ ధ్వానాలు, బ్యాండు మేళాలు, డీజే హోరు, డప్పు దరువులు, యువతీ యువకులు కోలాహలంగా చేసిన నృత్యాలు, సాంస్కృతిక కళారూపాల స్వాగతాలు.. ఆటపాటలతో భాగ్యనగరంలో గురువారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా ఉదయం కాస్త ఆలస్యంగా ప్రారంభమైన నిమజ్జన ఊరేగింపు మధ్యాహ్నం 2 గంటలకు వర్షం కాస్త తెరిపినివ్వడంతో ఊపందుకుంది. శుక్రవారం ఉదయం వరకు నిమజ్జన పర్వాన్ని కొనసాగించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్, దిల్‌సుఖ్‌నగర్-ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్- ఎన్టీఆర్‌మార్గ్, ఖైరతాబాద్-ట్యాంక్‌బండ్, చార్మినార్-హుస్సేన్‌సాగర్, కూకట్‌పల్లి-లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, లక్డీకాపూల్, నెక్లెస్‌రోడ్ తదితర ప్రధాన మార్గాల్లో కన్నుల పండువగా జరిగిన ఈ మహా నిమజ్జన క్రతువులో వర్షాన్ని లెక్కచేయకుండా లక్షలాదిమంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో 12 వేల సీసీ కెమెరాలు, 25 వేల మంది పోలీసుల పహారా మధ్యన సుమారు 388.5 కిలోమీటర్ల మార్గంలో శోభాయాత్ర సాగింది.

హుస్సేన్‌సాగర్ వద్ద 23 భారీ క్రేన్లతో గణనాథులను గంగ ఒడికి చేర్చారు. ఈసారి రికార్డు స్థాయిలో ఖైరతాబాద్ భారీ గణనాథుని నిమజ్జన ప్రక్రియ ఆరుగంటల వ్యవధిలో మధ్యాహ్నం సరికే పూర్తిచేయడం విశేషం. ఉదయం 8.20 గంటలకు పూజాధికాలు ముగించుకొని బడా గణేష్ నిమజ్జన యాత్ర మొదలైంది. ఖైరతాబాద్,లక్డికాపూల్,రాజ్‌దూత్‌చౌరస్తా మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరింది. మధ్యాహ్నం 1.45 గంటలకు క్రేన్ నెం.4 వద్ద నిమజ్జనం రికార్డు సమయంలో పూర్తయ్యింది. ఈ సమయంలో భారీ గణనాథున్ని చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం మధ్య స్వల్ప తోపులాట జరిగినా ఎవరికీ ప్రమాదం జరగలేదు.

కాగా బుధవారం అర్థరాత్రి చంపాపేట్‌లో నిమజ్జన పర్వంలో భాగంగా విద్యుత్ వైర్లను అడ్డు తప్పించబోయి వెంకటేశ్వర్లు, సందీప్ అనే వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మత్యువాతపడ్డారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా గురువారం ఉదయం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లో ఒక క్రేన్ అదుపుతప్పి గణనాథుని విగ్రహం స్వల్పంగా ధ్వంసమైంది. స్వల్ప అపశృతులు మినహా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు