గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌ అరెస్టు

28 Dec, 2016 05:13 IST|Sakshi
గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌ అరెస్టు

- మైనర్‌గానే నేరాలు ప్రారంభించిన అయూబ్‌
- ఇప్పటి వరకు మొత్తం 72 కేసులు నమోదు
- తాజాగా కామాటిపురలో ‘పాస్‌పోర్ట్‌ కేసు’

హైదరాబాద్‌: నగర పోలీసులు అసాంఘిక శక్తులపై ప్రయోగిస్తున్న ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ) యాక్ట్‌కు భయపడి దేశం దాటిపోయిన మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌ను ఎట్టకేలకు పట్టుకున్నారు. సోమవారం ముంబైలో ఇమిగ్రేషన్‌ అధికారులకు చిక్కిన ఇతడిని నగరానికి తీసుకువచ్చి మంగళవారం అరెస్టు ప్రకటించారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎన్‌.కోటిరెడ్డితో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ పూర్తి వివరాలు వెల్లడించారు.

హడలెత్తించే నేరచరిత్ర..
మహ్మద్‌ అయూబ్‌ఖాన్‌ అలియాస్‌ అయూబ్‌ పహిల్వాన్‌ అలియాస్‌ పఠాన్‌. ఆర్మీ మాజీ ఉద్యోగి జహంగీర్‌ ఖాన్‌ కుమారుడైన అయూబ్‌ తన 16వ ఏటే నేరాలు చేయడం ప్రారంభించాడు. 1989లో దోపిడీ, 1990లో హత్య కేసులు నమోదయ్యాయి. తన ముఠా సభ్యులతో కలసి కామాటిపుర, హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ల పరిధిలో మతఘర్షణలకు పాల్పడాడు. ఈ క్రమంలోనే 1991 ఏప్రిల్‌ 30న ఇతడిపై కాలాపత్తర్‌ పోలీసులు రౌడీషీట్‌ను తెరిచారు. ఎనిమిది మందితో ముఠా ఏర్పాటు చేసిన అయూబ్‌ గ్యాంగ్‌స్టర్‌గా మారి దందాలు ప్రారంభించాడు. 2005–07 మధ్య రియల్‌ఎస్టేట్‌ జోరుగా ఉన్నప్పుడు అనేక వివాదాల్లో తలదూర్చి ఆర్థికంగానూ బలపడ్డాడు. అయూబ్‌ అండ్‌ కో మీద మూడు కమిషనరేట్ల పరిధిలో 72 కేసులు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో రౌడీషీటర్‌ మహ్మద్‌ ఖైసర్‌తో వైరం ఏర్పడింది. వీరి ముఠాల మధ్య గ్యాంగ్‌ వార్స్, రెండు హత్యలు సైతం జరిగాయి.

పీడీకి భయపడి పరార్‌..
అదే సమయంలో నగర పోలీసు కమిషనర్‌ అసాంఘిక శక్తులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడం మొదలెట్టారు. ఖైసర్, జంగ్లీ యూసుఫ్‌లపై దీన్ని ప్రయోగించడంతో తనకూ తప్పదని భావించిన అయూబ్‌ బోగస్‌ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌ పారిపోయాడు. విదేశాలకు పారిపోయిన అయూబ్‌ను ఎలాగైనా పట్టుకోవాలని నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి ఐటీ సెల్, టాస్క్‌ఫోర్స్, సౌత్‌జోన్‌ పోలీసులను రంగంలోకి దింపారు. అయూబ్‌ చిన్న చిన్న మార్పులతో మూడు పాస్‌పోర్టులను పొందాడు. వీటి వివరాలతో తనపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేసే అవకాశం ఉందని భావించిన అయూబ్‌ షార్జాలో డూప్లికేట్‌ పాస్‌పోర్ట్‌ సైతం పొందాడు. అయితే సిటీ ఐటీ సెల్‌ చేసిన కృషి ఫలితంగా తాజా పాస్‌పోర్ట్‌ వివరాలు లభించాయి. దీని ఆధారంగా లుక్‌ అవుట్‌ సర్కులర్‌(ఎల్‌ఓసీ) జారీ చేశారు. దీంతో ముంబై విమానా శ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు అతను దొరికిపోయాడు.

ఒక్క రోజులో రెండు కేసులు..
అయూబ్‌కు జారీ అయిన రెండు నాన్‌ బెయిలబుల్‌ వారంట్ల ఆధారంగా ఎల్‌ఓసీ జారీ చేశారు. మరోవైపు అతడు తీసుకున్న నకిలీ పాస్‌పోర్ట్స్‌కు సంబంధించి కామాటిపుర పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయూబ్‌ను ఈ కేసులో అరెస్టు చేసినట్లు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఇతను విదేశాల్లో ఉంటూనే ఫోన్, తన అనుచరుల ద్వారా సిటీలో దందాలు చేశాడు. మంగళవారం ఇద్దరు అయూబ్‌ బాధితులు హుస్సేనిఆలం, చాంద్రాయణగుట్ట పోలీసు లకు తమకు ఎదురైన బెదిరింపులపై ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. వీటిలోనూ పీటీ వారంట్‌పై అరెస్టు చేయనున్నారు.

న్యాయవాది హత్యతో తీవ్ర సంచలనం...
అయూబ్‌ చేసిన నేరాల్లో న్యాయవాది మన్నన్‌ ఘోరీ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. మన్నన్‌ ఘోరీ ఖరీదు చేసిన ఓ ఇంటికి సంబంధించి అయూబ్‌ రూ.2.5 లక్షల మామూలు డిమాండ్‌ చేశాడు. దీనికి నిరాకరించడంతో 2002 జూలై 10న తన నలుగురు అనుచరులతో కలసి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో కింది కోర్టు అయూబ్‌కు జీవితఖైదు విధించింది. మూడేళ్ల జైలు జీవితం అనుభవించిన తర్వాత పైకోర్టు ద్వారా బెయిల్‌ పొంది 2014 ఏప్రిల్‌ 11న విడుదలయ్యాడు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా