'హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'

3 Aug, 2016 18:11 IST|Sakshi

హైదరాబాద్: 'తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ జీవోలు 123, 124 లను హైకోర్టు కొట్టివేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు' అని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ప్రజావ్యతిరేక విధానాలపై న్యాయస్థానం వెలువరించిన తీర్పు హర్షనీయమన్నారు. ఇది రైతుల విజయంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ పీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జీవో 123, 124 లను హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇది రైతులు, రైతు కూలీల విజయమన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని ఉత్తమ్ సూచించారు.

కాగా, ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం, చెల్లింపులపై గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోలను తెచ్చింది. అయితే ఈ జీవోలను సవాల్ చేస్తూ కరీంనగర్ జిల్లా రుద్రంగి రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రైతుల నుంచి నేరుగా భూమిని సేకరించేందుకు ఏర్పాటు చేసిన జీవోలలో అనేక లోపాలున్నట్లు రైతులు హైకోర్టుకు విన్నవించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. 123, 124 జీవోలను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు