టూర్ వెళ్లొద్దాం ఇలా..

14 Apr, 2016 01:28 IST|Sakshi
టూర్ వెళ్లొద్దాం ఇలా..

సాక్షి, సిటీబ్యూరో: ప్రతి మనిషికి నిత్యం ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇంటి బాధ్యతలు.. ఆఫీసు.. పిల్లలకు స్కూలు, కాలేజీ.. ఇలా చాలానే ఉంటాయి. ఎప్పుడూ ఒకేలా ఉండే జీవితం కొంత మార్పు కోరుకోవడం సహజం. చేస్తున్న పనికి విరామం ఇచ్చి ఎక్కడైనా వెళ్లి ఆనందంగా గడిపి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రత్యేకించి నేటి ‘స్పీడ్’ యుగంలో ప్రతి మనిషి యాంత్రిక జీవనం నుంచి బయటపడి కొన్ని రోజులైనా సరదాగా గడపడం అవసరం కూడా. కుటుంబమంతా జాలీ ట్రిప్ వేసేందుకు ఈ వేసవి కాలమే సరైన సమయం. ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న ప్రదేశానికి వెళ్లి రావద్దామనుకుంటారు. ఈ సమయంలో కొంచెం ప్లాన్‌తో సిద్ధమైతే టూర్‌ను బాగా ఎంజాయ్ చేయవచ్చు.
 
కలిసి చర్చించుకుంటే మేలు..
ఏ ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నారో.. ఆ ప్రదేశం గురించి కుటుంబ సభ్యులంతా కలిసి చర్చించుకొని ఏకాభిప్రాయానికి రండి. వెళ్లనున్న చోటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని, బడ్జెట్ వేసి ఖర్చులు అంచనాకు సరిపోతుందో లేదో చూడండి. అంతా ఓకే అనుకున్నాక కొన్ని రోజుల ముందే రెండు వైపులా టికె ట్లు రిజర్వేషన్ చేయించుకుంటే ట్రిప్‌లో సగం సమస్యలు తీరిపోతాయి.
 
బయలుదేరే ముందు..
వెళుతున్న ప్రదేశంలో దొరికే ఆహారం గురించి అప్పటికే ఒక అవగాహన ఉంటుంది. కనుక తదనుగుణంగా సిద్ధమవ్వాలి. పిల్లలు, వృద్ధులు కూడా ప్రయాణంలో ఉన్నప్పుడు వారిని అవసరమైన మందులు మర్చిపోవద్దు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెంట ఉండాల్సిందే. ఊరు వెళుతున్న సమాచారాన్ని సన్నిహితులకు, ఇరుగు పొరుగువారికి తెలియజేయడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని బట్టి సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా తెలియజేయడం తప్పనిసరి. అకస్మాత్తుగా గాలి మార్పు, నీటి మార్పు వలన కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం గడిపిన జాలీడేస్‌ని పదిలపరచుకోవడం కోసం కెమెరా, వీడియో ఉంటే మంచిది. కొన్ని చోట్ల సుదీర్ఘమైన ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాటి గురించి కూడా ముందే తెలుసుకుని అందుకు తగ్గట్టు ప్రయాణంలో బోర్ కొట్టకుండా ప్లాన్ చేసుకోవాలి.
 
ప్రతి ఖర్చుకు లెక్క ఉండాల్సిందే..
టూర్ సరికొత్త అనుభూతుల్ని పంచాలంటే ఉన్న సమస్యలను ఇంటి వద్దే మర్చిపోతే ఆనందంగా గడపవచ్చు. ఖర్చులకు అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ డబ్బులు తీసుకెళ్లండి. పరిస్థితిని బట్టి క్రెడిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్‌ను వినియోగించండి. చేసిన ప్రతి ఖర్చుకు లెక్క రాయండి. హోటల్‌లోని రూమ్‌లలో టైం వేస్ట్ చేయకుండా వీలైనంత సేపు సీయింగ్‌లో గడపండి. వీలైతే ఒక డైరీలో మీ ప్రయాణపు అనుభూతుల్ని అక్షరం బద్దం చేయండి. చారిత్రక ప్రదేశాలకు వెళ్లినప్పుడు వాటి గురించి పిల్లలకు వివరించండి. మీ టూర్ ప్లాన్‌కి ఏదైనా వివరాలు అవసరమైతే టీఎస్‌టీడీసీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. 040- 29801039/40, 9848540371, 9848125720, 040-23450165 నంబర్లలో సంప్రదిస్తే పర్యాటక ప్రాంతాల  వివరాలు అందిస్తారు. లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కూడా పొందవచ్చు.

మరిన్ని వార్తలు