ఘంటసాలకు నృత్యాంజలి

21 Apr, 2017 23:51 IST|Sakshi
ఘంటసాలకు నృత్యాంజలి

⇒ నేడు గానగంధర్వ ఘంటసాల నృత్యరూపక ప్రదర్శన
⇒ రవీంద్రభారతిలో సాయంత్రం 6 గంటలకు...


సిటీబ్యూరో: అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కోడలు పార్వతీ రవి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ‘గాన గంధర్వ ఘంటసాల’ పేరిట ప్రత్యేక నృత్యరూపకం ప్రదర్శిస్తున్నారు. రవీంద్రభారతి ఇందుకు వేదికవుతోంది. ఈ సందర్భంగా నగరానికి వచ్చిన పార్వతీ రవి సాక్షితో మాట్లాడారు.

ఘంటసాల పాటలతో నృత్యరూపకం చేయాలనే ఆలోచన తనకు 2007లో వచ్చిందని చెప్పారు. భావితరాలు ఆయనను నిత్యం స్మరించుకునేలా చేయడమే ఈ ప్రదర్శన లక్ష్యమన్నారు. తొలిసారి పదేళ్ల క్రితం చెన్నై మ్యూజిక్‌ అకాడమీలో ఘంటసాల పాటలతో నృత్య ప్రదర్శన చేస్తే హాల్‌ పూర్తిగా నిండిపోయిందన్నారు. అప్పటి నుంచి పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు.

ఘంటసాల స్ఫూర్తితోనే...
అమరజీవి ఘంటసాల వెంకటేశ్వరావు స్ఫూర్తితోనే ఈ నృత్య ప్రదర్శన జాతీయంగా, అంతర్జాతీయంగా సాగుతోందని చెప్పారు. ఈ నృత్య ప్రదర్శనకు మల్టీమీడియాను జత చేశామన్నారు. ఘంటసాల పేరిట కళాకారులకు అవార్డులు ఇచ్చే యోచన కూడా ఉందన్నారు.
ఘంటసాల వారసురాలిగా వీణ ఘంటసాల మూడో కుమారుడి కుమార్తె వీణ అద్భుతంగా పాటలు పాడుతుందని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తోందన్నారు. ఆమెను ఘంటసాలకు వారసురాలిగా చెప్పొచ్చని పార్వతి పేర్కొన్నారు.

ఘంటసాల వారసులు స్థాపించిన ‘కళా ప్రదర్శిని సంస్థ’ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందన్నారు. కాగా ‘గాన గంధర్వ ఘంటసాల’ పేరుతో జరిగే నృత్యంలో పార్వతీ రవి ఘంటసాల, శైలజ, సంచిత భట్టాచార్య, కవితా రాము, గోపికా వర్మ(మోహినీ హట్టం), హరి, చేతన, ఎల్‌.నరేంద్ర కుమార్‌ తదితరులు పాలుపంచుకుంటారు. 

మరిన్ని వార్తలు