'టీఆర్ఎస్ నేతల ఇళ్లను వదిలి మిగతావారిపై పడ్డారు'

24 Jun, 2014 10:41 IST|Sakshi

హైదరాబాద్ : అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండోరోజు కూడా కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. కాగా కట్టడాల కూల్చివేతను శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మంగళవారం అడ్డుకున్నారు. కూల్చివేతలను ఆపివేయాలని ఆయన  ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరారు. అయితే కూల్చివేతలు ఆపేది లేదని అధికారులు తేల్చి చెప్పారు.

దాంతో కూల్చివేతలను అడ్డుకున్న ఎమ్మెల్యే గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ టీఆర్ఎస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతల ఇళ్లను వదిలి మిగతా వారిపై పడ్డారని ఆయన ఆరోపించారు. తెలిసీ, తెలియక కొన్న భూములను రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్యే గాంధీ డిమాండ్ చేశారు.

కాగా  అక్రమ నిర్మాణాలపై చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గురుకుల ట్రస్ట్ భూముల్లోని అక్రమ నిర్మాణాల వివరాలను ఆగమేఘాల మీద ఆరా తీసి కూల్చివేతలు కూడా చేపట్టారు. ట్రస్ట్ భూముల్లో వెలిసిన కాలనీల్లో ఒకటైన అయ్యప్ప సొసైటీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సెంట్రింగ్‌ను, మరో భవనంపై పిల్లర్లను నిన్న ధ్వంసం చేశారు. దీంతో అయ్యప్ప సొసైటీలోని భవన యజమానుల గుండెల్లో దడ మొదలైంది.  ఏ క్షణాన తమ భవనంపైకి వచ్చి పడతారోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు