రేపే కౌంటింగ్

4 Feb, 2016 07:09 IST|Sakshi
రేపే కౌంటింగ్

సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన 1,333 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో... స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రంగా ఉంది. రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు మొత్తం కౌంటింగ్ పూర్తి కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాయంత్రం 4 గంటల్లోగా ఓట్ల లెక్కింపు పూర్తి చేయాల్సి ఉంది. అంతకన్నా ముందే ఇది పూర్తికానుంది. వివిధ వార్డుల్లో పోలైన ఓట్లు ... లెక్కింపు కోసం అందుబాటులో ఉన్న హాళ్లు, టేబుళ్ల సంఖ్యపై ఆధారపడి తొలి, చివరి వార్డుల ఫలితాలు వెల్లడికానున్నాయి.
   
ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక అడిషనల్ సూపర్‌వైజర్,  ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు.వీరిని ఎన్నికల పరిశీ లకులు, రిటర్నింగ్ అధికారులు రాండమ్‌గా నియమిస్తారు. ఉదయం 6 గంటల లోపునే సిబ్బంది రాండమైజేషన్‌ను పూర్తి చేస్తారు. వారు 6 గంటలకల్లా తమకు కేటాయించిన కేంద్రానికి చేరుకుంటారు.ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతుంది.కౌంటింగ్ మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తారు.ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలి అర్ధగంటలో పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కిస్తారు. వీటికి ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేస్తారు.ఈ కేంద్రాల్లోని సదుపాయాలను బట్టి కొన్ని వార్డుల తర్వాత మరికొన్ని వార్డుల లెక్కింపు చేపడతారు. మొత్తం మూడు విడతలుగా ఇది పూర్తి కానున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు