వేగం

1 Dec, 2015 00:58 IST|Sakshi
వేగం

ముంచుకొస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
12లోగా ముందస్తు ప్రక్రియ పూర్తి
ఆ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్
శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలతో నేతలు బిజీ
ఆస్తిపన్ను రాయితీపై త్వరలో ప్రకటన

 
 సిటీబ్యూరో:  జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. అధికారులు దీనికి సంబంధించిన పనులలో... అధికార పార్టీ నేతలు ప్రారంభోత్సవాలు... శంకుస్థాపనలలో బిజీగా ఉన్నారు. గత నాలుగైదు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇవి ఊపందుకున్నాయి. సంక్షేమ కార్యక్రమాల అమలు వేగం పెరిగింది. ఇటీవ ల ఐడీహెచ్ కాలనీలో రెండు పడకగదుల ఇళ్ల ప్రారంభోత్సవం... ఇంటింటికీ రెండు రంగుల చెత్తడబ్బాల పంపిణీని సీఎం లాంఛనంగా ప్రారంభించడం తెలిసిందే. సోమవారం మధురానగర్‌లో అధికారులు రెండు రంగుల చెత్త డబ్బాల పంపిణీ చేశారు. లాలాపేటలో రూ.3.80 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియంను ఇటీవల మంత్రి పద్మారావు  ప్రారంభించారు. మిగతా నియోజకవర్గాల్లోనూ ఈ తరహా కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయి. ముషీరాబాద్ తదితర నియోజకవర్గాల్లో కాంట్రాక్టులు పూర్తి కాని రహదారులకు సైతం లాంఛనంగా శంకుస్థాపనలు చేసినట్లు తెలుస్తోంది.

15 తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్
డిసెంబర్ 12లోగా వార్డుల (డివిజన్ల) రిజర్వేషన్లతో సహా పోలింగ్‌కు సంబంధించిన ముందస్తు ప్రక్రియలు పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. వీరి సమాచారం ఆధారంగా  15 తరువాత ఎప్పుడైనా ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభానికి అవకాశం ఉండదు. ఈలోగానే వీటిని పూర్తి చేయాలి. ఇక మిగిలింది కేవలం 15 రోజులే. అందుకే అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
 
త్వరలో ఆస్తిపన్ను రాయితీ
 నగరంలోని మురికివాడలతో పాటు చిన్న ఇళ్లలో నివసిస్తున్న వారికి ఆస్తిపన్ను రాయితీ అతి త్వరలో అమలులోకి రాానుంది. ఆస్తిపన్ను రూ.1200లోపు ఉన్న వారికి రూ.101 మాత్రమే వసూలు చేయాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలను జీహెచ్‌ఎంసీ సోమవారం ప్రభుత్వానికి నివేదించింది. ఆమోదం పొందగానే దీనిపై ప్రకటన వెలువడుతుంది. దీని ద్వారా 5,09,187 ఇళ్ల యజమానులకు ప్రయోజనం కలుగనుంది. నీరు, విద్యుత్తు బిల్లులు రెండూ కలిసి నెలకు రూ.300 మించకుండా వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
రహదారుల వైపు చూపు
 మరోవైపు 1000 కి.మీ. బీటీ రోడ్లు, 500 కి.మీ. వైట్‌టాపింగ్ రోడ్లకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే 912 బీటీ రహదారులకు రూ.337 కోట్లతో టెండర్లు పిలిచారు. నిరుద్యోగ యువతకు చెత్త సేకరణ ఆటోట్రాలీల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఈలైబ్రరీలు, జి మ్‌లపైనా శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే కూకట్‌ప ల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల్లో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లకు శంకుస్థాపనలు జరగ్గా... మరికొన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. సెల్ఫ్‌హెల్ప్‌గ్రూపులకు రు ణాల పంపిణీని వేగవంతం చేశారు. మోడల్ మా ర్కెట్లు, మల్టీపర్పస్ హాళ్లు, చెరువుల సుందరీకర ణ, పబ్లిక్ టాయ్‌లెట్ల పనులపైనా దృష్టి సారించారు.
 

మరిన్ని వార్తలు