ఇప్పట్లో కష్టమే!

19 Aug, 2015 03:08 IST|Sakshi
ఇప్పట్లో కష్టమే!

- జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై మల్లగుల్లాలు
- ఇంకా పూర్తికాని డీలిమిటేషన్
- వార్డుల రిజర్వేషన్లకు మరికొంత సమయం అవసరం
- హైకోర్టును ఆశ్రయించనున్న సర్కారు..?
- వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలు లేనట్లే!
సాక్షి, సిటీబ్యూరో:
అందరూ అనుకుంటున్నట్లుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఈ సంవత్సరాంతంలోగా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. రాబోయే డిసెంబర్ 15లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ఇప్పటి వరకు వార్డుల డీలిమిటేషన్, రిజర్వేషన్లు తదితర ముఖ్యమైన అంశాలు ఓ కొలిక్కి రాకపోవడం ఇందుకు ఊతమిస్తోంది. అలాగే, ఎన్నికలకు మరింత సమయం కోసం అవసరమైతే సుప్రీంకోర్టునైనా ఆశ్రయిస్తామని రాష్ట్ర మంత్రి ఒకరు ఇటీవల వ్యాఖ్యానించడమూ గమనార్హమే. ఎన్నికల జాప్యంపై అందిన ఫిర్యాదుపై పలు పర్యాయాలు విచారణ జరిపిన హైకోర్టు అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసి, డిసెంబర్ 15 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడం తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి అక్టోబర్ నెలాఖరులోగా డీలిమిటేషన్ పూర్తయ్యే అవకాశాల్లేవు. నిబంధనల మేరకు ముసాయిదా ప్రజలముందుకు తెచ్చాక, వారి అభ్యంతరాల స్వీకర ణ తదితరమైనవి పూర్తిచేసి గెజిట్‌లో ప్రచురించాక,  వార్డుల వారీగా ఎన్నికల జాబితా తయారీకి దాదాపు 70 రోజలు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అదే విషయాన్ని హైకోర్టుకు సైతం నివేదించారు. డీలిమిటేషన్ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించిన బీసీ గణన తదితరమైన వాటికోసం మరో 100 రోజులు అవసరమని కూడా అంచనా వేశారు. ఎంత వేగంగా ఈ పనుల్ని పూర్తి చేసినా నవంబర్‌లోగా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

నవంబర్ నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితేనే డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే వీలుంది. వాస్తవానికి అక్టోబర్ నెలాఖరునాటికే ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేయాల్సిందిగా హైకోర్టు అదేశించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్‌లో ఇది పూర్తయ్యేలా లేదు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ సవ్యంగా సాగేందుకు.. ఇతరత్రా అంశాల కోసం తమకు కొంత గడువు కావాల్సిందిగా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. సహేతుక కారణాలతో కొద్దిజాప్యాన్ని హైకోర్టు కూడా అంగీకరించగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు.
 
నిధులు కోల్పోయే ప్రమాదం
గ్రేటర్ ఎన్నికలు సకాలంలో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే బాగుంటుందని ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అతిపెద్ద మున్సిపల్ సంస్థకు పాలకమండలి లేకపోవడం వల్ల మౌలిక వసతులు దూరమవుతాయనే ఉద్దేశంతోనే తాము ఎన్నికల నిర్వహణపై కోర్టును ఆశ్రయించామన్నారు. అతిత్వరగా పాలకమండలి ఏర్పాటు కాకపోతే కేంద్రం నుంచి వివిధ అభివృద్ధి పనులకు రావాల్సిన నిధులు రాకుండా పోతాయన్నారు.

మరిన్ని వార్తలు