అంతా స్పెషల్

11 Apr, 2015 00:16 IST|Sakshi
అంతా స్పెషల్

ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలు... మరోవైపు ఎన్నికల ఏర్పాట్లు
జీహెచ్‌ఎంసీ యంత్రాంగం కసరత్తు


స్పెషల్...స్పెషల్... ఇది శనివారం స్పెషలో.. వేసవి స్పెషలో కాదు. జీహెచ్‌ఎంసీ స్పెషల్. ఈ వేసవిలో జీహెచ్‌ఎంసీ వివిధ బృహత్తర కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఓ వైపు పారిశుద్ధ్యం మెరుగుపరచడం... సదుపాయాల పెంపునకు స్పెషల్(నోడల్/క్లస్టర్) ఆఫీసర్ల నియామకం..మరోవైపు స్వయం ఉపాధికి రుణాలు..యువతకు అవసరమైన శిక్షణ... ఇంకోవైపు ఎన్నికల ప్రక్రియలో భాగంగా పునర్విభజనపై కసరత్తు.... ఇవన్నీ దాదాపు ఏకకాలంలోనే చేపట్టేందుకు  జీహెచ్‌ఎంసీ అధికార గణం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
 
సాక్షి, సిటీబ్యూరో : త్వరలో వెలువడనున్న హైకోర్టు ఆదేశాలపై జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది. దీనికి అనుగుణంగా సర్కారు పావులు కదుపుతోంది. స్పెషల్ ఆఫీసర్ పాలనలో నడుస్తున్న ప్రస్తుత సమయంలో అధికారులు ఆగమేఘాల మీద వివిధ పనులకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు డివిజన్ల పునర్విభజనకు కసరత్తు ప్రారంభించారు. మరోవైపు సీఎం ప్రకటన మేరకు నగరంలో  330 క్లస్టర్లను ఏర్పాటు చేసి.. పర్యవేక్షణ బాధ్యతలను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ స్థాయి అధికారులకు అప్పగించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందేందుకు భారీ ఎత్తున సంక్షేమ, స్వయం ఉపాధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పారిశుద్ధ్యం, పచ్చదనం కార్యక్రమాలను స్థానికుల సమన్వయంతో నిర్వహించేందుకు సివిల్ సర్వీస్ అధికారులతో ‘స్పెషల్’గా పనులు చేపట్టనున్నారు. నగరంలో ఉన్న సివిల్ సర్వీస్ అధికారులు ఎందరు? ఏఏ విధుల్లో ఉన్నారనే వివరాలు నమోదు చే సే పనిలో పడ్డారు. అందుబాటులో ఉన్నవారికి 330 క్లస్టర్ల బాధ్యత లు అప్పగించనున్నారు. పాలక మండలి లేకపోవడంతో అధికారుల కనుసన్నల్లో ఈ ‘స్పెషల్’ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

పునర్విభజనపై కసరత్తు

పునర్విభజనలో భాగంగా 150 డివిజన్లను 200కు పెంచేందుకు డీఎంసీలకే పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. సహజ వనరులకు భంగం వాటిల్లకుండా చూడటంతో పాటు ఒక డివిజన్ పూర్తిగా ఒకే సర్కిల్, ఒకే నియోజకవర్గం పరిధిలో ఉండేలా చూడాలని ఆదేశాలు వెలువడ్డాయి. సంబంధిత ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలు పక్క డివిజన్లలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఏ డివిజన్‌లోనూ 37వేలకు మించి జనాభా ఉండరాదని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై డీఎంసీలు కసరత్తు చేస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ఏసీపీల సహకారంతో దీని మ్యాపింగ్ పనులు చేయనున్నారు. డివిజన్ల పూర్తి బాధ్యతలు  సంబంధిత డీఎంసీలకే అప్పగించారు. సంబంధిత జోనల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారు.

సంక్షేమానికి ప్రాధాన్యం

ఇంకోవైపు వీలైనంత ఎక్కువమందికి సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. వంద రోజుల్లో మహిళా గ్రూపులకు రూ.వెయ్యి కోట్ల బ్యాంకు రుణాలిప్పించే కసరత్తు ప్రారంభించారు. యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వోద్యోగాలకు ఎదురు చూస్తున్న వారికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రూప్ వన్, పోలీసు ఉద్యోగాలకు వెళ్లాలనుకునే వారికి శిక్షణ ఇప్పించనున్నారు. యువతను ఆకట్టుకునేందుకు భారీ సంఖ్యలో జిమ్‌లు తెరవనున్నారు. లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నారు.

యువతను ఆకట్టుకునేందుకు...

స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు పేదల బస్తీలు.. యువతచెడు మార్గం పట్టేందుకు ఎక్కువ అవకాశాలున్న బస్తీలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాల వల్ల వారు నేర ప్రవృత్తికి దూరంగా ఉంటారని ఆశిస్తున్నారు. సంబంధిత బస్తీలను గుర్తించాల్సిందిగా పోలీసు విభాగానికి సూచించినట్లు తెలిసింది. పోలీసు ఉద్యోగార్ధులకు తొలిదశలో వెయ్యి  మందికి శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ నెల 16న కులీకుతుబ్‌షా స్టేడియంలో దీనికి శ్రీకారం చుట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వీటితో పాటు మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతున్నారు.

ఉమెన్ ఆన్ వీల్స్

ఉమెన్ ఆన్ వీల్స్ పేరిట బండ్ల ద్వారా వ్యాపారం చేసుకునే  అవకాశం కల్పించనున్నారు. మొబైల్ టిఫిన్ సెంటర్లు, ఐస్‌క్రీ ం, డ్రెస్ మెటీరియల్స్, చీరల విక్రయాల వంటి వాటితో పాటు ఇతర వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుంది. తొలిదశలో ఇలా దాదాపు 500 మందికి ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. నాలుగు చక్రాల బండ్లను వినియోగించుకొని జీవనోపాధి కల్పించే కార్యక్రమం ఇది. కార్లు, వ్యాన్ల నుంచి తోపుడు బండ్ల వరకు  ఇందులో ఉంటాయి. వీటికి సబ్సిడీపై రుణాలు అందిస్తారు. ప్రస్తుతం విధి విధానాలను రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు.

ఉచిత వైఫై.. ఆర్‌ఓ ప్లాంట్లు

వీటితో పాటు 200 ప్రదేశాల్లో ఉచిత వైఫై సదుపాయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1500 బస్తీల్లో నీటి శుద్ధికి ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. శుద్ధి చేసిన జలాన్ని చౌకధరకు విక్రయిస్తారు. మహిళలకు ఈ ప్లాంట్లు అప్పగించడం ద్వారా ఉపాధి కల్పించబోతున్నారు.

స్వయం ఉపాధికి..ఓటర్లను ఆకట్టుకునేందుకు..
 
 ప్రీ పోలీస్ శిక్షణ                  :    1000 మందికి
 జిమ్‌లు                          :    1000
 లైబ్రరీలు                         :    1000
 స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు :    25 బస్తీల్లో
 ఎస్‌హెచ్‌జీలకు రుణాలు       :    రూ.1000 కోట్లు

 డ్రైవర్ కమ్ ఓనర్ ద్వారా

 వాహనాలు                      :    5000 మందికి

 ఉమెన్ ఆన్ వీల్స్ ఉపాధి పొందే

 మహిళలు                       :    500 మంది
 ఆర్‌ఓ ప్లాంట్లు                    :    1500
 ఉచిత వైఫై ప్రాంతాలు           :    200

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు