బడ్జెట్‌ ఆహా..! పనులు ఊహ!!

9 Mar, 2017 00:08 IST|Sakshi
బడ్జెట్‌ ఆహా..! పనులు ఊహ!!

అంచనా చేరని ఆదాయం
ముందుకు సాగని పనులు
ఇదీ జీహెచ్‌ఎంసీ సంప్రదాయం


హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ అభివృద్ధికి వేస్తున్న బడ్జెట్‌ మహా గొప్పగా ఉంటోంది. కానీ, వస్తున్న నిధులకు.. చేస్తున్న ఖర్చుకు పొంతన కుదరడం లేదు. కలల బడ్జెట్‌ వాస్తవరూపం దాల్చకపోవడం ఏటా ఓ ప్రహసనంలా మారింది. ఊహిస్తున్న ఆదాయానికి.. వాస్తవంగా సమకూరుతున్న నిధులకు సంబంధం ఉండడం లేదు. దీంతో ఏటేటా జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌కు, ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి చేస్తున్న ఖర్చు మధ్య అంతరం భారీగా ఉంటోంది. ఈ సారీ అదే పునరావృతమైంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో ఇరవైరోజులే ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ శాసనసభ సమావేశాలు సైతం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌పై ‘సాక్షి’ విశ్లేషణ.

సాక్షి, సిటీబ్యూరో : మహానగరంలో పలు చోట్ల బహుళ వరుసల ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి పనుల కోసం ఎస్సార్డీపీ కింద రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్‌ లెక్కల్లో చూపారు. కానీ ఏడాది కాలంలో కేవలం రూ.125 కోట్లే ఖర్చు చేశారు. ఈ పనులకు నిధుల లేమి పెద్ద సమస్య అయితే.. భూసేకరణ, మెట్రోరైలు పనులు వంటి ఆటంకాలు మరోవైపు వచ్చిపడ్డాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి తప్ప, పురోగతి మాత్రం లేదు. మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ వద్ద పనులు సాగుతుండగా.. చింతల్‌కుంట వద్ద మొదలయ్యాయి. మిగతా జంక్షన్లలో ప్రారంభమే కాలేదు.

రోడ్లదీ అదేదారి..
నగర రోడ్లకు సైతం బడ్జెట్‌లో రూ.860 కోట్లు చూపించారు. కానీ ఈ ఆర్థిక సంవత్సర నిధుల్లోంచి రూ.209 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. గత ఏడాది వేసిన రోడ్ల పనులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు తప్ప కొత్తవాటిపై దృష్టి పెట్టలేదు. వైట్‌ టాపింగ్, పేవర్‌బ్లాక్‌లు, ప్లాస్టిక్‌ రోడ్లు  వేసేందుకు ప్రతిపాదనాలు చేసినప్పటికీ నిధుల లేమితో ముందడుగు పడలేదు.

కదలని వరద కాలువ
వరద కాలువల ఆధునీకరణకు బడ్జెట్‌లో రూ.257 కోట్లు చూపించారు. ఈ సంవత్సరం వర్షాకాలంలో పలు ప్రాంతాల ముంపు నేపథ్యంలో తిరిగి సర్వే పనులు చేపట్టారు. ఇప్పటి వరకు సర్వే మాత్రమే జరిగింది. వరద కాలువలను ఆధునికీకరించేందుకు భారీసంఖ్యలో ఆస్తుల్ని తొలగించాల్సి రావడంతో పునరాలోచనలో పడ్డారు. తొలగించాల్సిన ఆస్తుల్ని వీలైనంతమేరకు తగ్గించాలనే యోచనలో ఉన్నారు. వరద కాలువల (నాలాల) వెంబడి నివాసాలు ఏర్పరచుకున్నవారితో పాటు స్థానిక నేతల ఒత్తిళ్ల వల్ల ప్రకటనలకు తగ్గట్లుగా పనులు సాగలేదు. దీంతో రూ.50 కోట్లు మాత్రం ఖర్చు చేశారు.

స్లాటర్‌ హౌస్‌లదీ ఆతీరే..
ఇక స్లాటర్‌హౌస్‌ల కోసం బడ్జెట్‌లో రూ.20 కోట్లు చూపించారు. వీటిపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. నగరంలోని జీహెచ్‌ఎంసీ స్లాటర్‌హౌస్‌లు ప్రారంభమైనా తగిన విధంగా ప్రచారం చేయకపోవడంతో ఇప్పటికే ఎక్కువ మంది చెంగిచెర్లకే వెళ్తున్నారు. అయినా అధికారుల ఉదాసీనతకు కారణాలేమిటో వారికే తెలియాలి.

పేదల ఇళ్లు మరింత ఆలస్యం
నగరంలో నిరుపేదల ఇళ్ల కోసం రూ.250 కోట్లు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ, స్థల సేకరణలో జాప్యం.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వంటి కారణాలతో ఈ సంవత్సరం ఎలాంటి పనులూ జరగలేదు. ఈ పద్దులో కేవలం రూ.15 కోట్లే ఖర్చయ్యాయి.

అన్నింటిదీ అదే పరిస్థితి..
మోడ్రన్‌ మార్కెట్లు.. బస్‌షెల్టర్లు, పార్కింగ్‌ ప్రదేశాలు, నిరుద్యోగులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తదితర కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.140 కోట్లు కేటాయించారు. కానీ ఎలాంటి ఖర్చు చేయకపోవడంతో పథకాలు అమలుకు నోచుకోలేదు. చాలా పథకాలు ప్రారంభం కాకపోగా, మరికొన్ని కొంతమేర మాత్రమే జరిగాయి. ఇందుకు ఎన్ని కారణాలున్నా, ప్రధాన కారణం మాత్రం నిధుల సమస్యే.  

రాబడి పరిస్థితి ఇదీ..
రెవెన్యూ రసీదుల ద్వారా మొత్తం రూ.2,768.56 కోట్లు రాగలవని అంచనా వేస్తే, ఇప్పటి వరకు వచ్చింది రూ.1850 కోట్లు మాత్రమే. అలాగే క్యాపిటల్‌ రసీదుల ద్వారా రూ.4,938.43 కోట్లు రాగలవనేది అంచనా కాగా, వచ్చింది రూ.2,200 కోట్లు మాత్రమే. 

మరిన్ని వార్తలు