ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ అధికారి

3 Jul, 2016 02:56 IST|Sakshi
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ అధికారి

సికింద్రాబాద్: సికింద్రాబాద్ (సర్కిల్-18) జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఆడిటర్(గణాంకాధికారి)గా పనిచేస్తున్న నిత్యానంద్ లంచం తీసుకుంటూ...శనివారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన ఉమాదేవి, పద్మావతి ఇరువురు అక్కాచెల్లెల్లు. వారసత్వంగా వారి తల్లిదండ్రుల గృహం ఇరువురు అక్కాచెల్లెల్లకు వచ్చింది. సదరు గృహాన్ని గిఫ్ట్ డీడ్ చేసుకున్న ఉమాదేవి, పద్మావతి గృహం పేరు మార్పిడి కోసం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని పన్నుల విభాగంలో నిత్యానంద్‌ను సంప్రదించారు. పేరుమార్పిడి కోసం ఆయన డబ్బు డిమాండ్ చేయడంతో ఉమాదేవి ఎసీబీ అధికారులను సంప్రదించింది.

వారు ముందస్తు వ్యూహం మేరకు ఉమాదేవికి రూ. 2000 నగదును ఇచ్చి పంపించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిత్యానంద్ చాంబర్‌కు చేరుకున్న ఉమాదేవి వెంటతెచ్చుకున్న డబ్బును అప్పగించింది. అప్పటికే జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మాటువేసి ఉన్న ఏసీబీ డీసీపీ అశోక్‌కుమార్ బృందం దాడి చేసి నిత్యానంద్ తీసుకున్న లంచం డబ్బును స్వాధీనం చేసుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పలు ఫైళ్లను, ల్యాప్‌టాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వరకు కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇదే కార్యాలయంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన కృపాదానంను గత మే 11న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రెండు నెలలలోపే ఇరువురు అధికారులు ఏసీబీ వలలో చిక్కడం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కలకలం సృష్టించింది.

మరిన్ని వార్తలు