‘దిల్‌కుషా’లో మేయర్ క్యాంప్ ఆఫీస్?

13 Feb, 2016 17:22 IST|Sakshi

బంజారాహిల్స్ : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ క్యాంపు ఆఫీస్ కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు స్థలాన్వేషణ మొదలుపెట్టారు. ఇందుకోసం రాజ్‌భవన్ పక్కన ఉన్న దిల్‌కుషా గెస్ట్‌హౌస్, గ్రీన్‌ల్యాండ్స్‌లో ఉన్న గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్‌ను శనివారం గ్రేటర్ మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సెంట్రల్ జోన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల పరిశీలించారు. వీటిలో దిల్‌కుషా గెస్ట్‌హౌజ్ వైపు మేయర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఈ రెండు గెస్ట్‌హౌస్‌లలో ఒకదాన్ని రెండు రోజుల్లో ఎంపిక చేసి అందులో మౌలిక సదుపాయాలు కల్పించాలని తలపెట్టారు. మేయర్ కోసం క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. మేయర్‌ను కలవడానికి వచ్చేవారు ఇప్పుడున్న జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇరుకైన సౌకర్యాలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుసుకున్న అధికారులు ప్రత్యేకంగా క్యాంపు ఆఫీస్ అందుబాటులోకి తేవాలని యోచించి ఆ మేరకు రెండు గెస్ట్‌హౌస్‌లను పరిశీలించారు.

గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్ ముందు జరుగుతున్న మెట్రోపనులు వల్ల కొంత వరకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులతోపాటు మేయర్ కూడా భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం గెస్ట్‌హౌస్‌ను క్యాంపు ఆఫీస్ కోసం తీసుకోవాలా? కొన్ని గదులు మాత్రమే సరిపోతాయా అన్నదానిపై కూడా ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మొత్తానికి రెండు మూడు రోజుల్లో మేయర్‌క్యాంపు ఆఫీస్‌పై తుది నిర్ణయం వెలువడనుంది.

>
మరిన్ని వార్తలు