రోజుకు రూ.10 కోట్లు

17 Feb, 2016 02:42 IST|Sakshi
రోజుకు రూ.10 కోట్లు

* ఇదీ జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను లక్ష్యం
* ఇక వసూళ్ల పర్వం
* రెడ్ నోటీసులు జారీ

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల హడావుడి నుంచి అధికారులు బయటకు వచ్చారు. ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ఎన్నికల నేపథ్యంలో చూసీ చూడనట్లు వ్యవహరించిన అధికారులు ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రెడ్ నోటీసుల జారీకి వెనుకాడటం లేదు. మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులతో నిర్వహించిన తొలి సమావేశంలోనే మొండి బకాయిల వసూళ్లకు తాము సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

దీంతో అధికారులు రెట్టించిన ఉత్సాహంతో ఆస్తిపన్ను వసూళ్లకు సిద్ధమయ్యారు. ఏళ్ల తరబడి చెల్లించని వారి నుంచి నయానో, భయానో వసూలు చేయాలని భావిస్తున్నారు. తాజా అంచనాల మేరకు ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.450 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. ఉన్న గడువు దాదాపు 45 రోజులు. రోజుకు కనీసం రూ.10 కోట్లు వసూలు చేయాలని కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అధికారులకు నిర్దేశించారు.  
 
అభివృద్ధి పనులకు...
మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. జీహెచ్‌ఎంసీ ప్రకటించిన కార్యక్రమాలు.. ప్రభుత్వం హామీలిచ్చిన పథకాలు  ఈలోగా పూర్తి చేయాల్సి ఉంది. నగరంలో చేపట్టే పనులన్నిటికీ జీహెచ్‌ఎంసీ నిధులనే వినియోగిస్తున్నారు. ఆర్టీసీ వంటి సంస్థకూ    దీని నిధులనే బదిలీ చేస్తున్నారు. ఖజానాలో సింహభాగమైన ఆస్తిపన్ను వసూలు చేయకపోతే పనులన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భారీగానిధులు అవసరం.

ఈ నేపథ్యంలో సర్కిల్‌కు ఒకరు చొప్పున 24 మంది ప్రత్యేక అధికారులను వసూళ్లకు నియమించారు. వీరు సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లు, సిబ్బందితో కలసి లక్ష్యసాధనకు కృషి చేస్తారు. భారీ బకాయిలు ఉన్న వారిని వ్యక్తిగతంగా కలవడం, ఫోన్లు, ఎస్సెమ్మెస్‌లు, ఈ మెయిళ్ల ద్వారా గుర్తు చేస్తారు. రెడ్ నోటీసులూ జారీ చేస్తారు. ఇప్పటిదాకా పన్ను పరిధిలోకి రాని భవనాలను గుర్తిస్తారు. ప్రభుత్వ భవనాల నుంచి పన్ను వసూలుకు ప్రత్యేక చర్యలకు సిద్ధమయ్యారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రసార సాధనాలను వాడుకోవాలని, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
 
ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు    :    14,11,609 మంది
రావాల్సిన మొత్తం    :    రూ.1630 కోట్లు
ఇప్పటి వరకు వసూలై నది    :    రూ. 545 కోట్లు
ఇంకా రావాల్సింది    :    రూ. 1075 కోట్లు
ప్రభుత్వ రాయితీకి అర్హులు    :    5,09,187 మంది
రాయితీ ద్వారా తగ్గే మొత్తం     :     రూ. 87 కోట్లు

* పై అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 8 లక్షల మంది నుంచి రావాల్సిన ఆస్తిపన్ను: రూ.988 కోట్లు.
* ఇది ఒక దశలోని అంచనా. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం వసూలు చేయాల్సింది రూ.1100 కోట్లుగా తాజాగా అంచనా వేశారు. ఇప్పటి వరకూవచ్చినది పోనూ ఇంకా రూ.455 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు.
 
21న సమస్యల పరిష్కారం
ఆస్తిపన్ను వివాదాల పరిష్కారానికి ఈనెల 21న ఆదివారం అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ‘ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం’ పేరిట ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు, అన్ని స్థాయిల అధికారులు పాల్గొని ఆస్తిపన్ను చెల్లింపులో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు, వివాదాలు పరిష్కరిస్తారని తెలిపారు.

మరిన్ని వార్తలు