గ్రేటర్ అక్రమాల బూజు దులిపే ప్రయత్నాలు...

4 Dec, 2015 15:12 IST|Sakshi

 హైదరాబాద్‌ :  జీహెచ్‌ఎంసీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను కట్టడి చేయడానికి కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానంగా రవాణా విభాగంలో చోటుచేసుకుంటున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి. జనార్ధన్‌రెడ్డి చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీలో చెత్తను తరలించడానికి వినియోగిస్తున్న భారీ వాహనాలకు అవసరమైన డీజిల్ విషయంలో కొన్నేళ్లుగా అడ్డగోలు లెక్కలతో దోచుకోవడానికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ఇకనుంచి ఆన్‌లైన్ పద్ధతిలో డీజిల్ అందించే ఏర్పాటు చేస్తూ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ ద్వారా డీజిల్ అందించే పద్ధతి ప్రారంభించగా తద్వారా ప్రతి రోజూ దాదాపు 4 వేల లీటర్ల డీజిల్ ఆదా అవుతున్నట్టు తేల్చారు. 1.2 లక్షల లీటర్ల డీజిల్‌కుగాను ఒక నెలలో 60 లక్షల రూపాయలు కార్పొరేషన్‌కు ఆదా అవుతుందని అంచనా వేశారు.

గతంలో ప్రతిరోజూ 32 వేల లీటర్ల డీజిల్‌ను కూపన్ల ద్వారా వినియోగిస్తుండగా, ఆన్‌లైన్ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత 28 వేలకు తగ్గింది. నగరంలో జీహెచ్‌ఎంసీ ద్వారా చెత్త తరలించడానికి 500 వాహనాలు వాడుతున్నారు. దీనిలో డంపర్లు, జేసీబీలతో పాటు 25 టన్నులు, 10 టన్నులు, 6 టన్నుల సామర్థ్యం కలిగిన లారీలు ఉన్నాయి. వీటిల్లో 2 వందలకుపైగా వాహనాలు 15 ఏళ్ల సర్వీసు కూడా పూర్తయినవి ఉన్నాయి. వీటికి ప్రస్తుతం ప్రైవేటు బంకుల నుంచి తీసుకుంటున్న డీజిల్‌ను నేరుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి తీసుకోవడానికి వీలుగా ఐఓసీ అధికారులతో కమిషనర్ చర్చలు జరిపారు.

 

ఇలా చేయడం వల్ల ప్రతి లీటర్‌పై 50 పైసలు ఆదా కానుంది. ఇకపోతే వాహనాల మరమ్మతులన్నీ ఇకనుంచి ఆర్టీసీకి అప్పగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్ట్ విభాగం ద్వారా మరమ్మతులు చేపడుతున్నారు. పారదర్శకత కోసం టీఎస్‌ఆర్టీసీ ద్వారా వాహనాల మరమ్మతుకు అనుమంతించాలని కమిషన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ విషయంపై మరో రెండు రోజుల్లో ఆర్టీసీ అధికారులతోనూ చర్చించి విధివిధానాలు ఖరారు చేయనున్నారు.

>
మరిన్ని వార్తలు